విద్యార్థుల భవితకు ఉపాధ్యాయులు ఛాలెంజింగ్ గా పనిచేయాలి
మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి)
విద్యార్థి శక్తి సామర్ధ్యాన్ని గుర్తించి వారి సామర్ధ్యాల మేరకు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకొచ్చేందుకు ఉపాద్యాయులు చాలేంజిగ్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక విద్యా శాఖాధికారులకు సూచించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో
” తొలిమెట్టు” కార్యక్రమ అమలుపై సుదీర్ఘంగా చర్చించి విద్యా శాఖాధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన పరిధిలోని అవకాశాలను వినియోగించుకొని విద్యార్థుల సామర్ధ్యాన్ని గుర్తించి మెరుగైన ఫలితాలు రాబట్టాలని చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉపాధ్యాయుల తో పాటు ఉత్తమ విద్యార్థుల చేత ప్రత్యేక బోధన ద్వారా ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అన్నారు.వివిధ సబ్జెక్టు లలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని విద్యార్థులను బాల్య దశ నుండి ప్రాథమిక విద్యా సమయంలోనే తమ సామర్ధ్యాలను పెంపొందించుకునే విధంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం గా అమలు చేసి మంచి ఫలితాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా విద్యా శాధికారి అబ్దుల్ హై, జిల్లా సంక్షేమ శాఖాధికారి నర్మద, రీసోర్స్ పర్సన్స్, నోడల్ అధికారులు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.