ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌

మెరుపు వరదలతో ఇళ్లు,రోడ్లు ధ్వంసం
` ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌
` ఎనిమిది మంది కార్మికుల గల్లంతు
` సీఎం ధామికి మోదీ ఫోన్‌
డెహ్రాడూన్‌(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. దెహ్రాదూన్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహస్త్రధారలో వరద ధాటికి పలువురు గల్లంతయ్యారు. వరదతో పాటు వచ్చిన బురద,ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు,దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. రహదారుల పైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. రిషికేశ్‌లో చంద్రభాగానది ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. నదీ ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. తమ్సా, టన్స్‌, సాంగ్‌ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. డెహ్రూడూన్‌లో సహస్త్రధార ప్రాంతంలో వరదలు సంభవించి రోడ్లు కొట్టుకుపోయాయని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం మంగళవారం వెల్లడిరచింది. ఈ వరదల్లో చిక్కుకుపోయిన వారికి ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఇక ఉత్తరాఖండ్‌ జిల్లాలో వరదలు రావడంతో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని సమాచారం. దేవభూమి ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులతో సహా వంద మందికిపైగా ప్రజలను రెస్క్యూ దళం కాపాడిరది. వర్షాల వల్ల సహస్త్రధార, మాల్‌ దేవతా, ముస్సోరీ ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు- విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్‌ కుమార్‌ సుమన్‌ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది బృందాలుగా ఏర్పడి 300 – 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా, ఈ వరదల వల్ల సహస్త్రధార, డెహ్రాడూన్‌లో కొత్త దకాణలు దెబ్బతిన్నాయి. ఈ వార్తవిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం డెహ్రాడూన్‌లో, సహస్త్రధార ప్రాంతాల్లో పర్యటించారు.
ధామికి మోదీ ఫోన్‌
అయితే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితిపై ఆరా తీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామితో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఆరా తీశారు. ‘‘ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులకు చాలా నష్టం జరిగింది. జీవనోపాధి దెబ్బతింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నాతో మాట్లాడి అన్ని వివరాలను తీసుకున్నారు’’ అని ధామి తెలిపారు.ఈ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు ధామి తెలిపారు. దీంతో కృతజ్ఞతలు చెప్పారు. వారి మార్గదర్శకత్వం, మద్దతు రాష్ట్రంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిపాలనా యంత్రాంగం పూర్తిగా చురుగ్గా ఉందని, యుద్ధ ప్రాతిపదికన రక్షణ మరియు సహాయ కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలియజేశారు.వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. ఏ బాధిత కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలని, సహాయ సామగ్రి, సురక్షితమైన ఆశ్రయం, ఆహారం, నీరు, వైద్య సౌకర్యాలు వెంటనే అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుంది. పరిపాలన ఇప్పటికే హై అలర్ట్‌లో ఉంది. పోలీసులు, స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు’’ అని ధామి తెలిపారు.
ఎనిమిది మంది కార్మికుల గల్లంతు
ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో మైనింగ్‌ పనులు చేస్తుండగా, అకస్మాత్తుగా వరద ప్రవాహం రావడంతో అందులో అనేక మంది కార్మికులు చిక్కుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌?గా మారింది. ట్రక్కుపైన ఉన్న కార్మికులు ఒడ్డున ఉన్న ప్రజలను రక్షించమని వేడుకుంటున్నట్లు వీడియాలో కనిపిస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత ట్రాలీని కొట్టుకుపోయి బోల్తా పడిరది. దీంతో ఎనిమిది కార్మికులు చనిపోయినట్లు భావిస్తున్నారు అధికారులు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.