అవసరమైనపుడు జనంలోకి కేసీఆర్‌

` గ్రూప్‌ 1 నియామక ప్రక్రియపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి
` పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా ఉంది: కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): సీఎం రేవంత్‌ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. గ్రూప్‌ 1 అభ్యర్థులు సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు. ‘’నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్ట కొట్టారు. చేనేత పరిశ్రమను అతలకుతలం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా ఉంది. పాలన అద్భుతంగా ఉందనుకుంటే వెంటనే ఉప ఎన్నికలు పెట్టండి. ఉప ఎన్నికలు పెడితే పాలన ఎలా ఉందో తేలిపోతుంది. గ్రూప్‌ 1 నియామక ప్రక్రియపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఉద్యోగాల కోసం మంత్రి డబ్బులడిగారని అభ్యర్థులే చెబుతున్నారు. సమాధానం చెప్పాల్సింది పోయి మాపై ఉసిగొల్పితే ఎలా?’’ అన్నారు.‘’మంత్రులకు తెలియకుండా కాళేశ్వరం కేసును సీఎం సీబీఐకి ఇచ్చారు. కాంగ్రెస్‌, భాజపా మధ్య ఎంత మంచి అవగాహన ఉందో తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో బంధుప్రీతి లేదని అంటున్నారు.. సుజన్‌ రెడ్డి, అమిత్‌ రెడ్డికి వందల కోట్ల కాంట్రాక్టులు ఎలా వచ్చాయి? కోర్టు తుది తీర్పువచ్చేదాక అజారుద్దీన్‌ ఎమ్మెల్సీ కాలేరు. అజారుద్దీన్‌ క్రికెట్‌లో బాగా కట్‌లు కొట్టేవారు. ఇప్పుడు అజారుద్దీన్‌కే పెద్ద కట్‌ కొట్టారు. ప్రస్తుతం ఆయన త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయారు. జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు తెలుసు. సరైన సమయంలో ప్రజల్లోకి వస్తారు’’ అని అన్నారు. ‘’జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం ఏడు సర్వేలు చేయించాం. ఆ సర్వేలన్నింటిల్లోనూ భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని తేలింది. కాంగ్రెస్‌ చేపట్టిన మూడు సర్వేల్లోనూ మేమే గెలుస్తామని వచ్చింది. ట్రిపుల్‌ ఆర్‌ విషయంలో భారీ కుంభకోణం జరుగుతోంది. సీఎం బంధువుల కోసం దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ మారుస్తున్నారు. ఈ కుంభకోణంపై త్వరలో అన్ని వివరాలు బయటపెడతా’’ అని కేటీఆర్‌ తెలిపారు.