హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన


` నగరంలో మరోసారి భారీ వర్షం
` పలు చోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్‌ కష్టం
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అవిూర్‌పేట్‌, సనత్‌నగర్‌, కృష్ణానగర్‌, మియాపూర్‌, చందనాగర్‌, మాదాపూర్‌, రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్‌ బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అవిూర్‌పేట, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, యూసుఫ్‌గూడ, అవిూర్‌పేట్‌, పంజాగుట్ట, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు- పడ్డారు. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో వాహనాలు బారులుతీరాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు, నాలుగు రోజులపాటు- వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ , జగిత్యాల, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి
` అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
` అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశం
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయని, ట్రాఫిక్‌ కు అంతరాయం ఉన్నచోట్ల వెంటనే పోలీస్‌, హైడ్రా, ట్రాఫిక్‌ విభాగాలు తగిన చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు విభాగాల అధికారులు వర్షం ఎక్కువ కురిసిన ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు