గాజాలో మారణహోమం
` యుద్ధం మరింత ఉద్ధృతం..
` గాజా సిటీలో ఇజ్రాయెల్ భూతల దాడులు షురూ
గాజాస్ట్రిప్(జనంసాక్షి)గాజా నగరంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారాయి. కొన్ని రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ బలగాలు నేరుగా ఆ ప్రాంతంలో అడుగుపెట్టాయి. భూతల దాడులు ప్రారంభించాయి. ప్రాణభయంతో వేలాది మంది పాలస్తీనీయులు నగరాన్ని వీడుతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని ఐరాస నివేదికలో వెల్లడైన రోజే ఈ దాడులు ప్రారంభం కావడం గమనార్హం. మరోవైపు.. గాజా నగరవ్యాప్తంగా తాజాగా జరిగిన దాడుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు.గాజా సిటీ ఆపరేషన్‌లో ప్రధాన దశ ప్రారంభమైందని ఓ ఇజ్రాయెల్ సైనిక అధికారి వెల్లడిరచారు. శివారు ప్రాంతాల నుంచి నగరం నడిబొడ్డు దిశగా బలగాలు కదులుతున్నాయని తెలిపారు. ఈ నగరంలో దాదాపు రెండు వేల నుంచి మూడు వేలమంది హమాస్ ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా వేశారు. అదేవిధంగా అనేక రహస్య సొరంగాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఐడీఎఫ్ ఆపరేషన్‌కు ముందు గాజా సిటీలో దాదాపు 10 లక్షల మందికి పైగా పాలస్తీనా వాసులు నివాసం ఉండేవారు. ఇజ్రాయెల్ సైన్యం వివరాల ప్రకారం ఇప్పటివరకు 3.5 లక్షల మంది నగరం విడిచి వెళ్లారు. ఐరాస అంచనాల ప్రకారం గత నెలలో 2.20 లక్షలమందికి పైగా పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి తరలివెళ్లారు. హమాస్ నెట్‌వర్క్ ధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ సేనలు.. గాజా సిటీలో భూతల దాడులు ఎన్నిరోజులు కొనసాగుతాయో స్పష్టత ఇవ్వలేదు. దీనికి నెలలు పట్టొచ్చని స్థానిక మీడియా అంచనా వేసింది. ఈ ఆపరేషన్‌ను నిలిపేయాలంటూ హమాస్ చెరలో ఇంకా బందీలుగా ఉన్నవారి కుటుంబాలు ప్రధాని నెతన్యాహు నివాసం ఎదుట నిరసనలు చేపట్టాయి. దాదాపు 20 మంది బందీలు సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. పాలస్తీనా ఖైదీల విడుదల, శాశ్వత కాల్పుల విరమణ, గాజా నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకరిస్తేనే.. మిగిలిన బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది.