వినియోగదారుల సంతృప్తే సేవగా పనిచేస్తాం

బిఎస్‌ఎన్‌ఎల్‌ జిఎం మహంతి
శ్రీకాకుళం, జూలై 7 : జిల్లాలో వినియోగదారుల సంతృప్తే సేవగా పని చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా జనరల్‌ మేనేజర్‌ సిహెచ్‌ మహంతి చెప్పారు. స్థానిక నాగవళి హోటల్‌లో జిల్లా టెలికాం సలహా మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని టవర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు జిల్లావ్యాప్తంగా సేవలు విస్తృతం చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు 32,781, విల్‌ఫోన్‌ 7956, సెల్‌-1 కనెక్షన్లు 2,72,099, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు 5528 ఉన్నాయని తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 30 వరకు ల్యాండ్‌లైన్ల ద్వారా 14 కోట్లు, సెల్‌-1 ద్వారా 42 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. బకాయిలు 1.47 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ డిజిఎం ఎస్‌ వాసుదేవరావు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సిగ్నల్‌ ఉన్నా ప్రభుత్వ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమేనని తెలిపారు. జాతీయ రహదారి, సముద్ర తీర ప్రాంతాల్లో సెల్‌టవర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. 2వేల మంది ఉన్న గ్రామాలకు టవర్స్‌ వేయనున్నామని చెప్పారు. నందిగాం మండలంలో చాలా గ్రామాల్లో సెల్‌ సిగ్నళ్లు వచ్చేలా టవర్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సలహామండలి సభ్యులు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్‌. వెంకటరమణ, జి.అప్పలనాయుడు, ఎం. రవి, టెలికాం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.