విశాలాంధ్ర వజ్రోత్సవాల్లో ముగ్గురికి సత్కారం

విజయనగరం, జూన్‌ 28 : జాతీయ తెలుగు దినపత్రిక విశాలాంధ్ర వజ్రోత్సవాలు సందర్భంగా జూలై 1న జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించి ముగ్గురు ప్రముఖులను సత్కరించనున్నట్లు విశాలాంధ్ర విజ్ఞాన సమితి బుధవారం తెలిపింది. ఆరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో ‘ జిల్లాలోని నీటి ప్రాజెక్టులు – పర్యావరణాన్ని కలుషితం చేసే ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు’ అనే అంశంపై చర్చ జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా సీనియర్‌ జర్నలిస్టు డి.అచ్యుతరావు, సామాజిక కార్యకర్తలు అబ్ధుల్‌ రవూఫ్‌, అశోక్‌ సాంఘీలను సత్కరిస్తామన్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే అశోక్‌ గజపతిరాజు , అతిధులుగా ఎంపి ఝాన్సీలక్ష్మి, కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య, విశాలాంధ్ర విజ్ఞాన సమితి పాలకవర్గ సభ్యులు సి.హెచ్‌. రాఘవేంద్రరావు, డిసిసి అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి , టిడిపి అధ్యక్షులు ద్వారపురెడ్డి జగదీష్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి , వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కన్వీనర్‌ పి.సాంబశివరాజు, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.సన్యాసిరాజు, రచయిత్రి చాగంటి తులసి, విశాలాంధ్ర మేనేజర్‌ వెంకటేశ్వర్లు పాల్గొంటారని ఆయన తెలిపారు.