వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం

కేసీఆర్‌ ఆలోచనల మేరకు అభివృద్ది: మంత్రి
హైదరాబాద్‌,మార్చి5(జ‌నంసాక్షి): ఆరుగాలం కష్టించి, అనేక కష్ట నష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిశలు పాటుపడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. స్వంత పెట్టుబడితో సాగులోకి దిగేవిధంగా రైతులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉండాలన్నారు. అన్నిరకాల ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకునే విధంగా చైతన్యం కలిగించాలని కోరారు.  దీనిలో భాగంగానే ప్రభుత్వంరాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచిందని  తెలిపారు. సాగు అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సక్రమంగా ముందుకు తీసకుని వెళ్లాలన్నారు.  రైతులు ఆత్మగౌరవంతో బతికేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి దేశం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు కేటాయిస్తున్నారని మంత్రి  పేర్కొన్నారు.  ప్రతీ అంశాన్ని రైతులకు వివరించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేవిధంగా రైతుల్లో అవగాహన కల్పించాల్సిన భాద్యత అధికారులదేనని అన్నారు. పాత పద్దతులకు స్వస్తి పలికి ఆధునిక పరికరాలు వినియోగించి వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయారంగంలో 14 పథకాలు అమలు చేస్తున్నారని, వందశాతం యాంత్రీకరణ జరిగేలా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒక విస్తరణాధికారిని నియమించేందుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే భూసార పరీక్షలు ఎంతో కీలకమని ఆయన వ్యాక్యానించారు. రైతులను నట్టేట ముంచుకున్న నకిలీ విత్తన విక్రేతలపై పీడీ యాక్టు ప్రయోగించాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం మూడు రకాల బీమా పథకాలను అమలు చేస్తున్నదని వెల్లడించారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక కార్యక్రమాలను అమల్లోకి తీసుకువస్తున్నారని  అన్నారు.