షెట్టర్ల కుంభకోణంపై మరింత లోతుగా అన్వేషణ

శ్రీకాకుళం, జూలై 12 (: వంశధార షెట్టర్ల కుంభకోణంలో విశాఖ సిఐడి అధికారుల బృందం మరింత లోతుగా అన్వేషణ చేస్తోంది. మరోవారం రోజుల పాటు వంశధార డివిజన్‌ కార్యాలయంలోనే తిష్ట వేసి లోతుగా వివరాల సేకరణపై దృష్టి పెట్టింది. విశాఖ సిఐడి విభాగం ఇన్‌స్పెక్టర్‌ ఇమ్యూనల్‌ రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు బృందం పలు దస్త్రాలను సోధిస్తుంది. ఇంతవరకు కార్యాలయానికి చెందిన పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా పనులకు చెందిన దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే వంశధారకు చెందిన ఇద్దరు అధికారులను సిఐడి అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ ఏడాది ఏప్రిల్‌లో విశ్రాంత సిఇ ప్రసాదరావును, మే నెలలో ఇఇ సుధాకరరావును అధికారులు అరెస్టు చేశారు. మరికొంతమందిని అరెస్టు చేసేందుకు దర్యాప్తు సంస్థ సన్నద్ధమవుతోంది. మరోవారం రోజుల పాటు నరసన్నపేటలో పనులను చెందిన దస్త్రాలను పరిశీలించి అవసరమైన వాటిని స్వాధీనం చేసుకుంటారు. వంశధార డివిజన్‌ కార్యాలయంలో సిఐడి ఇన్‌స్పెక్టర్‌ ఇమ్యూనల్‌ రాజుతో పాటు ఎస్సై ఎం.వెంకటరావుల బృందం రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేసుకొని దర్యాప్తులో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, గుత్తేదార్లలో గుబులురేగుతుంది.