సంక్షేమ కార్యక్రమాల అమలులో

ప్రభుత్వ వాహన డ్రైవర్ల బాధ్యత కీలకం : కలెక్టర్‌
కడప, జూలై 22: ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అమలు, పరిశీలన, సమీక్షలో ప్రభుత్వ డ్రైవర్ల బాధ్యత కీలకమైందని జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ డ్రైవర్లకు అసోసియేషన్‌ సన్మానం జరిపింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ డ్రైవర్లు విధుల పట్ల క్రమశిక్షణ, నిబద్దత, సమయపాలన పాటించడం వల్ల ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ప్రగతిలో ఉన్నారన్నారు. ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణలో డ్రైవర్ల పాత్ర చాలా కీలకమైనదన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఈ లోగా చిన్న పాటి ఇంటిని నిర్మించుకోవాలనే తపన ఉంటుందన్నారు. అదివారి చిరకాల వాంఛగా మిగిలిపోకుండా డ్రైవర్లకు నివాస స్థలాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.
జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ హేమసాగర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ డ్రైవర్లు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆందోళనలు వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకిత భావం పాటించి ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా యంత్రాంగానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు. అనంతరం 11 మంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ వాహన డ్రైవర్లను జిల్లా కలెక్టర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వాహన డైవర్ల సంఘ అధ్యక్షులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.