సంబురాలు అంబరాన్ని తాకాలి

C

– ఊరూ వాడా ఒక్కటై తెలంగాణకు జై కొట్టాలి

– అమరుల కుటుంబాలకు ఘనంగా సన్మానాలు

– ఉత్సవకమిటీ సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వీటిని రాష్ట్ర పండగలా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని, ఈ మేరకు ఆయన అధికారులు, మంత్రులతో సవిూక్ష నిర్వహించారు. గతంలో కనీవిని ఎరుగని రీతిలో ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందులో అమరుల కుటుంబాలక పెద్దపీట వేయడమే గాకుండా వారిని ఘనంగా సన్మానించాలని నిర్నయించారు. ఊరూవాడా పండగలా సంబరాలు చేసేలా చూడాలని ఉత్సవ కమఇటీకి సూచించారు. సిఎం నిర్వహించిన సవిూక్షకు ఉత్సవాల నిర్వహణ కేబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌ నాయిని నర్సింహారెడ్డి, మంత్రి ఈటెల రాజేందర్‌, సీఎస్‌ రాజీవ్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఏర్పడాలన్నారు. హైదరాబాద్‌లో గవర్నర్‌, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొనేలా సభ నిర్వహించాలని సూచించారు.

జిల్లా కేంద్రంలో జిల్లాకు చెందిన మంత్రి, కలెక్టర్‌, ఇతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రాల్లో ఘనంగా సన్మానించాలని, వారికి వీఐపీ ¬దా కల్పించాలని సూచించారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని ఆహ్వానించి, గౌరవించాలని పేర్కొన్నారు. జీవిత సాఫల్య, పురస్కారంతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మందికి రాష్ట్ర స్థాయిలో, 25 మంది చొప్పున జిల్లా కేంద్రంలో అవార్డులు బహుకరించాలని చెప్పారు. హైదరాబాద్‌ తో పాటు ఇతర నగరాలు, జిల్లా కేంద్రాల్లో వీధులు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలను అలకరించాలని పేర్కొన్నారు. పరిశ్రమలు, ఆస్పత్రులు, ¬టళ్లు, మాల్స్‌, థియేటర్స్‌లో కూడా పండుగ వాతావరణం ఉండాలన్నారు. ఈ మేరకు అలంకరణలు బ్రహ్మాండంగా చేపట్టాలని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలుపుతూ బ్యానర్లు, ¬ర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎయిర్‌పోర్టు, హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లను అలంకరించి బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రులలో రోగులకు, అనాథ శరణాలయాలు, అంధ పాఠశాలల్లో పండ్లు, స్వీటు పంచాలి.. మాంసాహారం అందించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, ఇతర ప్రార్థన స్థలాల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. జిల్లా, డివిజన్‌, నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్ర ఆవిర్భావం ఇతివృత్తంగా తెలుగు, ఉర్దూ భాషల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని అమరవీరుల స్థూపాలు, తెలంగాణ తల్లి విగ్రహాలను అలకరించాలని సూచనలు చేశారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై జూన్‌ 2న రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబురాలు చేయాలన్నారు. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలకు స్వీట్ల పంపిణీ చేయాలని పేర్కొన్నారు.