సడక్‌బంద్ వద్దనుకుంటే
తెలంగాణ ప్రకటించండి
అడ్డంకులెన్ని సృష్టించినా సడక్‌బంద్ విజయవంతం చేద్దాం
కోదండరామ్ పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (జనంసాక్షి) :
సడక్ బంద్ వద్దనుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించాని సడక్ బంద్ నిర్వహించి తీరతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని తెలిపారు. ఉద్యమకారులపై బైండోవర్ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 24న నిర్వహించే సడక్‌ను ఎలా విజయవంతం చేయాలి, ప్రభుత్వ ఎత్తులను ఎలా చిత్తు చేయాలనే అంశాలపై చర్చించారు. హైదరాబాద్- కర్నూలు జాతీయ రహదారి దిగ్బంధం పోస్టర్‌ను కోదండరామ్ ఆవిష్కరించారు. తెలంగాణ అంశాన్ని నెల రోజుల్లో పరిష్కరిస్తామని మాట ఇచ్చి తప్పిన కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా సబక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రజలు కూడా సడక్ బంద్‌కు
సహకరించాలని ఆయన కోరారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ప్రభుత్వానికే నష్టమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుకొనే హక్కు ప్రజలకు ఉంటుందని, ఈ విషయం ప్రభుత్వం గమనించాలని సూచించారు. కేసులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. ఉద్యమకారులపై బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. తక్షణమే బైండోవర్లను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. బైండోవర్ కేసులు పెట్టాల్సింది ప్రజలపై కాదని, మాట తప్పుతున్న కాంగ్రెస్ నేతలపైనేనని తెలిపారు. తెలంగాణ వాదాలపై ప్రభుత్వ తీరు అమానుషమన్నారు. కేసులు ఎత్తివేస్తామని ¬ం మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇచ్చిన మాటకు కూడా విలువ లేదని పేర్కొన్నారు. సడక్ బంద్ జరగొద్దని ప్రభుత్వం అనుకొంటే తెలంగాణపై ప్రకనట వచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. సబక్ బంద్ శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. మార్చి 2న జరగబోయే సడక్ బంద్ గురించి స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీ ఎన్జీవోల వ్యవహారంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల కార్యాచరణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ నెల 27న విశాఖ కోర్టుకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. కోర్టుకు హాజరు కావాలని విశాఖపట్నం న్యాయస్థానం సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కోర్టుకు హాజరవుతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. పైవిధంగా బదులిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణవాదులను గెలిపించాలని పిలుపునిచ్చారు.