సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి

శ్రీకాకుళం, జూలై 16: సమాచార హక్కు చట్టంపై ప్రజలను చైతన్య వంతిన్ని చేయాలని, నిజాయతీగా సమాచారం అడిగే విధంగా అవగాహన కల్పించాలని గీతం యూనిర్సిటీ లా కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వై.సత్యనారాయణ అన్నారు. గ్రామస్థాయి నుంచి సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేసి, చైతన్యం తీసుకువస్తే లక్ష్యం నెరవేరుతుందన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోంలో సమాచారం హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భ ఆయన మాట్లాడుతూ దేశంలో నిరక్షరాస్యత, పేదరికం వల్ల చాలా సమస్యలు ఉన్నాయని, వీటిని ఆసరాగా చేసుకొని అవినీతి పెరుగుతుందన్నారు. పత్రికలు కీలక పోషించి అవినీతిని వెలుగులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు తెలుస్తుందన్నారు. సమాచార హక్కు చట్టం గౌరవాన్ని పెంచే విధంగా దరఖాస్తుదారులు వ్యవహరించాలన్నారు. సమాచారం అడిగే ప్రతి వ్యక్తికి ఆశయం ఉండాలని, సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఉండాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక కన్వీనర్‌ బి.రామకృష్ణరాజు, ప్రొఫెసర్‌ డి.విష్ణుమూర్తి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్‌.రమేష్‌, క్షేత్ర ప్రచార అధిరి డా. జి.కొండలరావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రుంకు అప్పారావు, సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.