సమైక్యాంధ్ర ఓ కలహాల కాపురం…

తెలుగోళ్లందరూ ఒకటేనంటూ పనిగట్టుకొని ఆనాడు విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడంతోనే సీమంధ్రుల మోసాలు ప్రారంభమయ్యాయి. నీళ్లు,నిధులు,ఉద్యోగాలు ఇలా ఒక్కటేమిటి ప్రతిదాంట్లోనూ సమయం దొరికినప్పుడల్లా అందినకాడికి అందుకపోవడమే సీమాంధ్రులు మొదటినుంచి చేస్తున్న పని. ప్రతి దాంట్లోనూ తెలంగాణ పట్ల అంతులేని వివక్షను చూపిస్తుంది. తెలంగాణ బిడ్డలపై ప్రభుత్వం నిర్లక్ష ధోరణిని ప్రదర్శిస్తున్నది. సీమాంధ్రులపై కన్నతల్లి ప్రేమ, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నది. తాజాగా మెడికల్‌ కాలేజి సీట్ల వ్యవహారంలోనూ కిరణ్‌ సర్కార్‌ అదే వివక్షను చూపింది. ఒక్క కిరణ్‌ సర్కార్‌  మాత్రమే కాదు. సీమాంధ్ర పాలకులంతా అనాదిగా చేస్తున్న దోపిడీలో ఇది ఓభాగం మాత్రమే.  మెడికల్‌ కాలేజీ సీట్ల వ్యవహారంలో తెలంగాణలో మూడు కాలేజీలు, సీమంధ్రలో మూడు కాలేజీలు మొత్తం ఆరు కాలేజీల్లో 300 అదనపు సీట్లు అవసరం కాగా కేవలం సీమంధ్రలోని మూడు కాలేజీలకు కాలేజీకి 50 సీట్ల చొప్పన 150 అదనపు సీట్లు కేటాయించింది. అయితే తెలంగాణకు సీట్ల విషయంలో మాత్రం మొండిచెయ్యి చూపింది. తెలంగాణ, సీమంధ్ర విడిపోయేందుకు ఇంతకంటే కారణం ఇంకేం కావాలి. ఏం.. తెలంగాణ విద్యార్థులు మెడిసిన్‌ చదివేందుకు పనికిరారా? అక్కడ విద్యార్థులకు ఇక్కడ విద్యార్థులకు సమాన అర్హతలు లేవా..?  ఉన్నపుడు అక్కడ మాత్రమే సీట్ల సంఖ్య పెంచి ఇక్కడ పెంచకపోవడం దేనికి నిదర్శనం..? సమైక్యాంధ్ర కలహాల కాపురం.. తెగేదాక లాగకుండా ఇరు ప్రాంతాల ప్రజల మద్య ఎలాంటి వైషమ్యాలు రాకముందే తెగదెంపులు చేసుకుంటే మంచిది. గ్రూప్‌-1 ఉద్యోగాల వ్యవహారంలోనూ సాక్షాత్తు ఏపీపీఎస్సీ చైర్మన్‌లే తెలంగాణ ఉద్యోగాలు ఎత్తుకెళ్లారు. ఇంటర్వ్యూ మార్కుల వద్ద గోల్‌మాల్‌ చేసి తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు రాకుండా చేశారు. అవును మరి సాక్షాత్తు ఏలికలే తెలంగాణ పట్ల వివక్షలు చూపెడ్తుంటే ఏపీపీఎస్సీ చైర్మన్‌లు ఎంత? సీమాంధ్రులు ఆడే రాజకీయ చదరంగంలో వాళ్లు ఓ పావులే. 610 జీవో, ఫ్రీజోన్‌ అన్నింటా అన్యాయమే జరిగింది. ఏదో రూపకంగా నీళ్లు దోచి, నిధులు దోచి, తెలంగాణ ఉద్యోగాన్ని దోచుకెళ్లేందుకు సీమాంధ్ర సర్కార్‌ కుట్ర పన్నుతూనే ఉంది. తెలంగాణ బిడ్డలు డాక్టర్‌లు కాకూడదో ఏమో మెడికల్‌ సీట్లలో కూడా వివక్ష కనబర్చింది. పది జిల్లలు ఉన్న తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయో కేవలం నాలుగు జిల్లలు రాయలసీమలోనే అన్ని ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఏలికలు తెలంగాణ ప్రాంతంపై చూపిస్తున్న ప్రేమ ఏపాటిదో. అన్నింట్లోనూ దగా చేస్తూ తెలుగోళ్లందరం కలిసుండాలంటే ఎలా కుదురుతుంది. సీమంధ్ర సర్కారు ముసలికన్నీరు నమ్మడానికి తెలంగాణ వాళ్లెవరూ సిద్దంగా లేరు. సీమాంధ్రతో తెలంగాణ కలిసుండడం ఏప్రాతిపదికన  సాధ్యపడుతుంది. కలిసుండి కలహించుకునేబదులు విడిపోయి కలిసుండడం అందరికీ మంచిది.