సర్కారీ ఉద్యోగులకు త్వరలో డీఏ పెంపు
హైదరాబాద్,నవంబరు 11(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ విడుదలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వెంటనే విడుదల చేస్తామని హావిూ ఇచ్చినట్లు టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో టీజీవో అధ్యక్షులు, ఇతర ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎంతో చర్చించారు. జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు పక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలకు, త్వరలోనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం చెప్పినట్లు టీజీవోలు పేర్కొన్నారు. ఉద్యోగుల సర్దుబాటు పక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కృషి వల్లనే నిరుద్యోగులకు 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి అని టీజీవోలు స్పష్టం చేశారు.