సింగరేణి క్వార్టర్ ఖాళీ చేస్తేనే!గ్రాట్యుటీ చెల్లిస్తారా?ఇదెక్కడి న్యాయం””!

 ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు.ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు.
సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల,ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంక్షేమ శాసనం రూపొందించబడింది.1972 ఆగస్ట్ 21న పార్లమెంటులో ఆమోదించబడి సెప్టెంబర్ 16 నుండి “”గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 “‘గా అమలవుతుంది.మరల సవరించబడి రూ.10 లక్షల చెల్లింపు పరిమితి నుండి రూ.20 లక్షల చెల్లింపు పరిమితితో 2018 మార్చి 29 నుండి అమలవుచున్నది.గ్రాట్యుటీని పొందడానికి కనీస సర్వీస్ ను 5 సంవత్సరాలు ఉండాలి.5వ, సంవత్సరం సర్వీస్ లో 240 రోజులు విధులు నిర్వహించిన వారు కూడా అర్హులవుతారు.ఉద్యోగ విరమణ సమయమున పొందిన వేతనాన్ని 30 సంవత్సరాల సర్వీస్ వరకు ఏడాదికి సగం నెల వేతనాన్ని,30 సంవత్సరాల పిదప చేసిన సర్వీస్ కు సంవత్సరానికి నెల వేతనాన్ని లెక్కించి గ్రాట్యుటీగా రూ.20 లక్షల పరిమితికి లోబడి చెల్లించుతారు.గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972,సెక్షన్ 7 ప్రకారం యాజమాన్యం    గ్రాట్యుటీని  చెల్లించడానికి కార్మికుడి నుండి దరఖాస్తు ను తీసుకోవాలి.అలాగే గ్రాట్యుటీని లెక్కించి ఉద్యోగికి మరియు నియంత్రణ అధికారికి నోటీస్ ను ఇచ్చి
30 రోజుల లోపు చెల్లించాలి. నిర్ణీత పరిమితి లోపు చెల్లించడంలో విఫలమైతే సాధారణ వడ్డీని చెల్లించాలి.సెక్షన్ 13 ప్రకారం ఉద్యోగికి చెల్లింపచేసే గ్రాట్యుటీ నుండి ఎటువంటి మినహాయింపులకు సంబంధించిన కోర్ట్ ఆర్డర్స్ గాని,డిక్రీని గాని అటాచ్ మెంట్ చేయరాదు.మధ్యప్రదేశ్ హైకోర్టు 2018లో వెస్ట్రన్ కోల్ పీల్డ్స్ లిమిటెడ్ మేనేజర్ ప్రయాగ్ మోడీ కేసులో గ్రాట్యుటీ చెల్లింపును యాజమాన్యంకు ఇష్టానుసారంగా నిలిపి వేసే అనియంత్రిత అధికారం లేదని తీర్పు చెప్పింది.1996 లో ట్రావెన్ కోర్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ వర్సెస్ రీజనల్ జాయింట్ లేబర్ కమీషనర్ ఆఫ్ కేరళ కేసులో యాజమాని యొక్క భూమిని ఉద్యోగి వదిలిపెట్టనందున గ్రాట్యుటీ చెల్లింపును నిలిపివేయరాదని సూచించారు. సెక్షన్ 4(6) ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపును తిరస్కరించడానికి ఉద్యోగి నివాస కార్పొరేట్ ఆస్తికి ముడిపెట్టడం తగిన కారణం
కాదని చెప్పింది. కోల్ ఇండియా లిమిటెడ్,సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లకు సంబంధించిన ””జాయింట్ బైపార్టీయేట్ కమిటీ ఫర్ ది కోల్ ఇండస్ట్రీ”‘(జెబిసిసిఐ)కూడా గ్రాట్యుటీ చెల్లింపు
 చట్టం 1972 ప్రకారంగా రిటైర్డ్ అయిన కార్మికులకు  గ్రాట్యుటీని చెల్లించాలని ఒప్పందం చేశాయి.క్వార్టర్ ఖాళీకి గ్రాట్యుటీ చెల్లింపు కు ముడిపెట్టరాదని సూచించింది. నెంబర్. సిఐఎల్/సి–5బి/జెబిసిసిఐ/09 తేది 16/01/2019 సర్క్యులర్ ను కూడా జారీ చేసింది.
                     సింగరేణి యాజమాన్యం కార్మిక వర్గంపై
ఉక్కుపాదం మోపడంతో పాటుగా ఆర్ధిక యిబ్బందులకు గురి చేయడానికి తాజాగా సర్క్యులర్ ను జారీ చేసింది. నెంబర్.సీఆర్పీ/పిఇఆర్/డబ్ల్యూ ఇ ఎల్/2023/3197 తేది 09/8/2023 గల నిబంధనలను  డైరెక్టర్ పర్సనల్, అడ్మినిస్ట్రేట్ అండ్ వెల్ఫేర్ పేరుతో ఆదేశించింది.30 నుండి 35 ఏండ్లు నిత్యమూ ప్రమాదాలతో సహవాసం చేసి తల్లి కడుపులాంటి బొగ్గు బావులలో బొగ్గును ఉత్పత్తి చేసి లోకానికి వెలుగులను ఇచ్చిన రిటైర్డ్ కార్మికులను కనీసం 6 నెలలు కూడా సంస్థ క్వార్టర్ లలో నివాసం ఉండనీయడం లేదు.ఒక వేళ క్వార్టర్ లో   నివాసం ఉండదలిస్తే అనుమతి తీసుకుని నెలకు రూ.5 వేల కిరాయిని చెల్లించాలని షరతులు పెట్టింది.సరే! కిరాయి చెల్లింపుకు కార్మికులు ఎవరు వ్యతిరేకం కాదు.ఎవరిదైన సొమ్మే అని భావించే గుణం కార్మికుల కు ఉన్నది.6 నెలల కిరాయి కాదు గదా, ఏడాది అద్దెనైన అడ్వాన్స్ గా చెల్లించడానికి కూడా రిటైర్డ్ కార్మికులు సిద్ధముగా ఉన్నారు. కాని సింగరేణి యాజమాన్యం చేస్తున్నదేమిటి? రిటైర్డ్ అయిన కార్మికులకు చట్టం ప్రకారంగా రూ.20 లక్షల పరిమితితో కూడిన గ్రాట్యుటీని  చెల్లించకుండా దగ్గర పెట్టుకొని ఇబ్బంది పెడుతుంది.రిటైర్డ్ అయిన డబ్బులతోని ఇల్లు నిర్మించుకునే కలలకు  కళ్ళెం వేసింది.   రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ లోన్ సౌకర్యం ఉన్నది.సర్వీస్ లో ఉన్నప్పుడే ఇండ్లు కట్టుకున్నారు.మనకు పట్టణాలలో ఎన్ జీవో,బ్యాంక్, పోస్టల్,టీచర్స్,పోలీస్,ఎల్.ఐసి,రెవిన్యూ, ఎక్స్ సైజ్,
బంజారాహిల్స్,జూబ్లీ హిల్స్ లలో ఎమ్మెల్యేలు,ఐఏఎస్,ఐపీఎస్ కాలనీలకు ప్రభుత్వం ఇండ్ల జాగలను కేటాయించింది.ఇండ్ల నిర్మాణముకు
అప్పులను ఇచ్చింది.కాని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుంట భూమి,సరళంగా హౌస్ లోన్ లు ఇచ్చిన దాఖలాలు లేవు. అందుగురించి సింగరేణి కార్మికులు రిటైర్డ్ తో వచ్చిన డబ్బులతోని ఇండ్లు నిర్మించుకోవడం పరిపాటయ్యింది.
                           సింగరేణి జనరల్ మేనేజర్(సివిల్)
సిహెచ్.రమేశ్ బాబు చెప్పిన లెక్కల ప్రకారంగా 49,000 నివాస క్వార్టర్ లు ఉన్నవి.ఇంకా జైపూర్,సత్తుపల్లి, భూపాలపల్లిలో కొత్తగా నిర్మించిన 1,478 క్వార్టర్ లు ఉన్నవి.కాని క్వార్టర్ ల సంఖ్య కంటే కార్మికులు 42,733 మంది తక్కువగా ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా అద్దె చెల్లింపు మరియు లీజ్ ప్రతిపాదికన వ్యాపారులకు,లాయర్ లకు,కాంట్రాక్టర్ లకు, రాజకీయ నాయకులకు,విలేకరులకు,పోలీసులకు,టీచర్ లకు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 3 వేల క్వార్టర్ లను ఇచ్చారు.అయినప్పటికీ కూడా ఇంకా వేల క్వార్టర్ లు ఖాళీగా ఉన్నవి.రిటైర్డ్ కార్మికుల కు కూడా అద్దె చెల్లింపు ప్రాతిపదికన క్వార్టర్ లను కేటాయించే అవకాశం ఉన్నది.కాని అధికారులు తమ  వైయక్తిక ప్రయోజనాలను పొందడానికి సింగరేణి క్వార్టర్ లను ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు.కాని రిటైర్డ్ కార్మికుల యెడల చట్టం ప్రకారంగానైన సహకరించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో 44 రోజులు సమ్మె చేసి రాష్ట్ర ఏర్పాటులో పాలుపంచుకున్నారు.దానికి  కృతజ్ఞతగా    ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని వేళలలో సింగరేణి కార్మికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నారు.కాని సింగరేణి రిటైర్డ్ కార్మికులపై యాజమాన్యం సాగిస్తున్న సాచివేత చర్యలను నిలువరింపచేయడానికి జోక్యం    చేసుకోవాలని కోరుకుంటున్నారు. రిటైర్డ్ కార్మికులు గొంతెమ్మ కోర్కెలను ఏమి కోరడం లేదు.గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 ప్రకారంగా రూ.20 లక్షల గ్రాట్యుటీని చెల్లింప చేయాలని,సింగరేణి క్వార్టర్ లను అద్దె చెల్లింపు మరియు లీజ్ ప్రతిపాదికన ఇతరులకు కేటాయించినట్లుగానే రిటైర్డ్ కార్మికులకు కూడా కేటాయించాలని కోరుకుంటున్నారు.
కృతజ్ఞతలతో,                    మీ భవదీయుడు
                                    మేరుగు రాజయ్య
                          సెల్ నంబర్ — 9441440791.