సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం సరికాదు
బిజెపి తీరును ఎండగట్టిన సిఐటియూ
గోదావరిఖని,అక్టోబరు 26 (జనంసాక్షి ) సింగరేణి నిర్వీర్యం అవుతుంటే హుజురాబాద్ ఉప ఎన్నిక ముఖ్యమయ్యిందని సీఐటీయూ రాష్ట్ర అద్యక్షుడు రాజారెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం పాట వేయడానికి నిర్ణయించిందని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి మాట్లాడడం లేదని అన్నారు. సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హావిూలు ఇప్పటి వరకు నెరవేరలేదని సీఐటీయూ రాష్ట్ర అద్యక్షుడు రాజారెడ్డి విమర్శించారు. గత సింగరేణి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామిలు సొంత ఇంటి కల నెరవేరలేదని, కొత్త బొగ్గు గనులు రాలేదన్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోపోవడం విడ్డూరంగా ఉందని, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని విమర్శించారు. జెన్కో నుంచి రావాల్సిన రూ.12వేల కోట్లను ఇప్పటి వరకు చెల్లించలేదని, సింగరేణికి వచ్చిన లాభాలను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతూ సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం లేదని, రామగుండం ఏరియాలో కార్మిక కుటుంబాలకు మంచినీటి సరఫరా చేయలేని దుస్థితిలో సింగరేణి యాజమాన్యం ఉందని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉందని, బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నాలుగు బొగ్గు బ్లాకుల వేలం పాటలను ఆపాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడుకోవడం కోసం కార్మికులు, కార్మిక సంఘాల ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.