అక్బరుద్దీన్‌కు 22వరకు రిమాండుజిల్లా జైలుకు తరలింపు

అదిలాబాద్‌్‌, జనవరి 16 :వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని విచారణ నిమిత్తం పోలీసు కస్టడీ నుంచి జ్యూడిషియల్‌ రిమాండుకు తరలిస్తూ బుధవారం ఉదయం నిర్మల్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఆజేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు అక్బరుద్దీన్‌ను జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో 14 రోజుల పాటు అక్బరుద్దీన్‌ను రిమాండుకు తరలించగా.. విచారణ నిమిత్తం 5 రోజుల పాటు తమ కస్టడీలోకి అనుమతించాలని పోలీసుల పిటిషన్‌ మేరకు మెజిస్ట్రేట్‌ అందుకు అనుమతిస్తూ ఈ నెల 16వ తేదీ వరకు విచారణకు అనుమతి ఇచ్చారు. కాగా తమ విచారణ పూర్తయిందని, ఈ కేసులో తమకు రావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నందున అక్బరుద్దీన్‌ను బుధవారం తెల్లవారుజామున నిర్మల్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచడంతో 22 వరకు జ్యూడిషియల్‌ రిమాండుకు తిరిగి జిల్లా జైలుకు తరలించాలని మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. కాగా పోలీసుల విచారణలో అక్బరుద్దీన్‌ పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు నిర్మల్‌ సభలో చేసిన ప్రసంగం సీడీలో తన గొంతు కాదని ఆయన పోలీసులకు వెల్లడించ డంతో విచారణ అధికారులు డైలమోలో పడినట్టు తెలిసింది. విచారణ బుధవారం సాయంత్రం వరకు కొనసాగించాల్సి ఉండగా సాయంత్రం మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చాల్సిన సమయంలో ఏవైనా సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నేటి ఉదయం భారీ బందోబస్తు మధ్య నిర్మల్‌కు తరలించి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా జిల్లాలో 144వ సెక్షన్‌ కొనసాగుతోంది.