అడ్డగింతలతో ఆగిపోతుందా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం ఇప్పుడు తరస్థాయికి చేరుకుంది. 1969లో యావత్‌ విద్యార్థిలోకం ఏకమై సలిపిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రజానీకం ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తున్నారు. రాజకీయ పక్షాలు ఏ దారిలో నడిచినా పోరుదారి తప్పితే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరంగల్‌లో కాకతీయ ఉత్సవాల ప్రారంభోత్సవానికి వచ్చి తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష ఎంతో ప్రబలంగా ఉందో ప్రత్యక్షంగా చూశారు. రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకే భయపడి హెలిక్యాప్టర్‌లో ఓరుగల్లు కోటకు చేరుకుని నామమాత్రంగా ఉత్సవాలు ప్రారంభించి చక్కా పోయాడు. ఆయన హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు చేరుకునేందుకు పట్టిన సమయంతో పోలిస్తే వేదికపై మాట్లాడిన సమయం వందోవంతు కన్నా తక్కువే. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సీఎంతో పాటు చవిచూసిన మరో ప్రబుద్ధుడూ ఉన్నారు. ఆయనే ఒకప్పటి మెగాస్టార్‌ చిరంజీవి. అన్ని ప్రాంతాల ప్రజల అభిమానంతో ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి విశ్వాసాన్ని మరిచి తాను ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తిని అని చాటుకున్నాడు. డిసెంబర్‌ 9న తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయగానే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నట్లుగానే చిరంజీవి సమైక్యరాగం ఆలపించాడు. ఆ రోజు ఆయన చేసిన ప్రకటనపై కనువిప్పు కలిగించేలా ఓరుగల్లు ప్రజానీకం గర్జించారు. పోలీసులు తరుముతున్నా, లాఠీలతో చితకబాదుతున్నా వెనక్కు తగ్గలేదు. యావత్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలుపుతూ సీఎం, చిరంజీవికి పట్టపగలే చుక్కలు చూపారు. హన్మకొండ నడిబొడ్డున సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో తెలంగాణ పౌరుషాగ్నిని చాటి చెప్పారు. ముఖ్యమంత్రి క్యాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్ల వర్షం కురిపించారు. పరిస్థితి ఇంతదాక తెచ్చేందుకు కారకులకు కనువిప్పుకలగాలని వీలైనన్ని ప్రయత్నాలు చేశారు. ఒకరోజు ముందు కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ప్రత్యేకరాష్ట్రంపై మీ వైఖరి చెప్పాలంటూ నిలదీశారు. యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఎన్నడూ ఎదుర్కోని నిరసనను బాబు బూరుగుపల్లిలో చవిచూశారు. తెలంగాణవాదులపై ఆయన అనుచరులు, పోలీసులు విరుచుకుపడి దాడి చేశారు. అయినా తెలంగాణవాదులు వెనక్కి తగ్గలేదు. లాఠీదెబ్బలకు వెరువలేదు. తమ ఆకాంక్షను ఎలుగెత్తిచాటారు. వచ్చిన తెలంగాణకు అడ్డుపడిన బాబూ చూడు ప్రత్యేకవాదం తీవ్రత అని చాటారు. మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు షర్మిలకు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ సెగ రుచిచూపించారు. చంద్రబాబు యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తున్న రోజు నిరసన తెలిపేందుకు వెళ్లిన జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. తర్వాత కూడా అవకాశం చిక్కిన చోటల్లా తెలంగాణ ప్రజలు అటు బాబుయాత్రకు, ఇటు షర్మిల యాత్రకు అడ్డుతగులుతూనే ఉన్నారు. కానీ వారు ఎప్పుడు అదుపుతప్పలేదు. తమ ఆకాంక్షపై మీ పార్టీ వైఖరెంటో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇంతకాలం ఎంతో ఓర్పుతో ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ప్రజానీకం ఇప్పుడిప్పుడే కోపం ప్రదర్శిస్తోంది. తమ ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని, భాషను, యాసను గేలిచేసిన సీమాంధ్ర పెత్తందారులపై తిరుగుబాటుకు దిగుతున్నారు. ఇదికూడా స్వల్ప తిరుగుబాటే. తెలంగాణపై ఈనెల 28న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై సానుకూల నిర్ణయం ప్రకటించాలని కోరుతూనే నిరసన తెలుపుతున్నారు. ప్రజల్లో ఓపిక నశిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. తమ నాలుగున్నర దశాబ్దాల పోరాటాన్ని అపహాస్యం చేసి డబ్బు సంచులతో అడ్డుకోవాలని చూసిన పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటనలో అడుగుకో పోలీసును భద్రత కోసం నియమించినా వెరవకుండా నిరసన తెలిపారు. కోడిగుడ్లు, రాళ్ల వర్షం కురిపించారు. నగరంలోనే ఉన్న ఖిలా వరంగల్‌కు రోడ్డు మార్గాన కాకుండా హెలిక్యాప్టర్‌లో వెళ్లేలా తమ పోరాట పటిమను ప్రదర్శించారు. అంత కష్టపడి ఖిలాకు చేరుకున్న ముఖ్యమంత్రి ఉత్సవాలపై రెండే నిమిషాలు మాట్లాడి ప్రసంగం ముగించారు. అంతకుముందు మాట్లాడిన చిరంజీవికి తెలంగాణ సెగ తప్పలేదు. తెలంగాణవాదినని చెప్పుకుని మంత్రి పదవి దక్కించుకున్న బస్వరాజు సారయ్య వెళ్లి చిరంజీవి చెవిలో ఏదో విషయం చెప్పాడు. అది ఏమిటంటే పరిస్థితి బాగా లేదు కాబట్టి త్వరగా ముగించమని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసన ఎదురవుతుందని. ఇంత దొంగల్లా ఉత్సవాలు ఎందుకు ప్రారంభించినట్లు, నిమిషాల్లో మాట్లాడి హెలిక్యాప్టర్‌ ఎందుకు ఎక్కినట్లు అనే విషయం సీమాంధ్ర పాలకులకే తెలియాలి. కేవలం సీమాంధ్ర ప్రాంతానికే ముఖ్యమంత్రి, మంత్రుల్లా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు ఇలాగే స్పందిస్తారు. హైదరాబాద్‌లో పోలీసుల బందూకుల మధ్య అవాకులు చెవాకులు పేలే కుక్కషేరు బాంబులాంటి నేతల అసలు బండారం, పిరికితనం వరంగల్‌లో బట్టబయలైంది. ఇంకా సీమాంధ్ర పెత్తందారులు మొండిగా వ్యవహరించినా, దాటవేసే సమాధానాలు చెప్పినా నిరసనలు, అడ్డంగితలతో ఉద్యమం ఆగుతుందనుకుంటే అంతకు మించిన తప్పిదం మరొకటి ఉండదు.