అధికార పార్టీ టిక్కెట్‌ అయితే చాలు

పంచాయితీ ఎన్నికలతో నేతల్లో హడావిడి

సంగారెడ్డి,జూన్‌23(జ‌నం సాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారిలో అప్పుడే హడావిడి మొదలయ్యింది. సర్పంచ్‌ పదవులను ఆశిస్తున్న వారు ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. అయితే రిజర్వేషన్లు కరారు కాకపోవడంతో ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఏ రిజర్వేషన్‌ వచ్చినా తమకుచెందిని అభ్యర్థి ఎవరన్నది రెడీ చేసి పెడుతున్నారు. మహిళా రిజర్వేషన్‌, ఎస్సీ,ఎస్టీ, బిసి ఇలా ఎవరైనా తమవర్గం వారే ఉండేలా అభ్యర్థులను రెడీ చేస్తున్నారు. దీంతో జిల్లాలో పంచాయితీ ఎన్నికల వేడి మొదలయ్యింది.త్వరలోనే రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుండడంతో… గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకున్నది. ఎన్నికల బరిలో ఉండాలనుకున్న ఆశావహులు ఆయా గ్రామాల ముఖ్య నేతలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో బీసీ ఓటర్ల పూర్తి అయ్యింది. కాగా వారం రోజుల వరకు రిజర్వేషన్లను ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఖరారు చేసే రిజర్వేషన్‌లు కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పదేండ్ల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. దీంతో ఎలాగైనా గెలిచి తీరాలని ఔత్సాహికులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల అధికారులు సైతం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, వార్డుల వారీగా ఓటరు జాబితాలను తయారు చేసి అందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు రానున్నాయి. అయితే ఓటరు జాబితా ప్రామాణికంగా తమ గ్రామానికి ఏ రిజర్వేషన్‌ వస్తుందో..?అని నేతలు అంచనాల్లో మునిగి తేలుతున్నారు. నేతలు తమ అనుచరులతో సమావేశమై బరిలో ఉండి విజయం కోసం చేయాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్‌ను బేరీజు వేసుకుని సామాజిక వర్గాల పెద్దలను ఓ చోటకు చేర్చి విందులతో చర్చలు మొదలు పెట్టారు. గెలుపే లక్ష్యంగా అంచనా లేసుకుంటూ బరిలో ఉండేందుకు రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రదానంగా అధికార పార్టీలోనే ఈ హడావిడి కనిపిస్తోంది. అధికార పార్టీ నుంచి అనుమతి వస్తే చాలన్న రీతిలో గ్రామాల్లో నేతలు ఉన్నారు. జూలైలో ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. ఓటర్ల జాబితాలను గ్రామాలలో ప్రదర్శించడంతో ఎన్నికల కోలాహలం ముందే ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ కూడా ఇటీవల అధికారులతో నిర్వహించిన సవిూక్షలో సంకేతాలు ఇచ్చారు. అధికారులు కూడా ఆ దిశగా సన్నాహాలు చేస్తుండటంతో పల్లెల్లో రాజకీయ వేడి మొదలైంది. ఎక్కడా చూసిన ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిస్తే రిజ్వరేషన్‌ ఏది వస్తుందో అని మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల్లో బరిలో నిలవాలనే ఆలోచన ఉన్నవారు ఏదో ఒక కారణంతో పల్లెల్లో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో జనాకర్షణ కలిగిన అభ్యర్థుల వేటలో పడినట్లు తెలుస్తున్నది.