అధ్యాపకుల కృషితో పెరిగిన ఉత్తీర్ణత
కరీంనగర్,మే2( జనం సాక్షి): ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించి ఉంటే మరింతగా ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు వచ్చి ఉండేవని, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మరింత దృష్టిపెడితే వచ్చే ఏడాది ఫలితాల శాతం పెరిగే అవకాశం ఉందని పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో క్రమక్రమంగా విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా బోధన చేస్తూ ప్రభుత్వ కళాశాలలను బతికించుకోవాలనే ఆశయంతో తొలిసారిగా ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కళాశాలల్లో చేరిన ప్రతి విద్యార్థికి ఎలాంటి రుసుం లేకుండానే ప్రవేశం కల్పించటంతో విద్యార్థుల నుంచి స్పందన లభించింది. కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. తొలిసారిగా ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నం ఫలించింది. వీటితోపాటు విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేస్తుండటంతో ప్రవేశాలు పెరుగుతున్నాయి. వసతులు అంతంతమాత్రంగానే ఉన్నా అడ్డంకులను అధిగమించి అధ్యాపకుల సమష్టి కృషితో ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది మెరుగైన ఉత్తీర్ణతా శాతం నమోదైంది. ఉచిత పాఠ్య పుస్తకాలు..ఎలాంటి రుసుం లేకుండానే ప్రవేశాలు కల్పించాలనే ప్రభుత్వ ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. ఏళ్ల తరబడిగా సొంత భవనాలు లేకున్నా, పత్తాలేని ప్రయోగశాలలు..బోధన సిబ్బంది సమస్యలు వేధిస్తున్నా ఉత్తీర్ణతలో ముందు వరసలో నిలిచారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, గోదావరిఖని ప్రాంతాల్లో తప్ప మిగతా జూలపల్లి, ముత్తారం, ధర్మారం, రామగుండం, కమాన్‌పూర్ మండలాల్లో అందరూ ఒప్పంద అధ్యాపకులే విధులు నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడిగా సొంత భవనాలు లేవు. ఒక్కొక్కటిగా ఇటీవల కాలంలో నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కళాశాలల ఆరంభం నుంచి జిల్లాలో ప్రత్యేక తరగతులపై దృష్టిసారించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించారు. ప్రతిరోజు పాఠ్యాంశాల వారీగా బోధన చేసిన అధ్యాపకులు ఆయా పాఠ్యాంశాలపై పలు రకాల పరీక్షలను ఏర్పాటు చేశారు. పరీక్షకు మూడు నెలల ముందు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించిన అధ్యాపకులు దత్తత తీసుకుని సాధన చేయించారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేస్తూ అనుమానాలను నివృత్తి చేశారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ వెల్లివిరిసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పోటీపడి ఉత్తీర్ణత సాధించారు.