అనుకోని అతిథిగా పెళ్ళింటికి కెసిఆర్‌

దారిలో వెళుతూ పెళ్లి వేదిక వద్దకు వెళ్ళి ఆశీర్వాదం
ఆశ్చర్యపోయిన ప్రజలు
కరీంనగర్‌,మే10(జ‌నం సాక్షి): ఓ పెళ్లి వేడుకలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అనుకోని అతిథి తమ పెళ్లికి రావడంపై అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనలో ఉండగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రైతు బంధు పథకాన్ని ప్రారంభించేందుకు కరీంనగర్‌ వెళ్లిన కేసీఆర్‌ బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన శంకరపట్నం మండలం తడికల్‌ గ్రామం విూదుగా వెళ్తుండగా ఓ పెళ్లి వేడుక దర్శనమిచ్చింది. వెంటనే వాహనాలు ఆపించి ముఖ్యమంత్రి స్వయంగా నడుచుకుంటూ వెళ్లి వివాహానికి హాజరయ్యారు. నేరుగా మండపం పైకి వెళ్లి నూతన వధూవరులను సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ ఆశీర్వదించారు. అంతేకాకుండా కల్యాణలక్ష్మీ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ హఠాత్తు పరిణామంతో పెళ్లి బృందం షాక్‌కు గురైంది. ముఖ్యమంత్రే స్వయంగా పెళ్లికి రావడంతో ఆశ్యర్యపోవడం అక్కడున్న వాళ్ల వంతైంది.