అనుభవాన్ని జోడిస్తా .. కేసీఆర్‌కు అండగా ఉంటా: డీఎస్‌

C

హైదరాబాద్‌,ఆగష్టు 28 (జనంసాక్షి):

తనకున్న పరిచయాలు,అనుభవాన్ని  జోడించి,అంతర్‌రాస్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌ నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్‌ అన్నారు. ప్రధానంగా మనకుఎపితో సమస్యలు ఉన్నాయన్నారు. శుక్రవారం ఆయన సలహాధారుగా  బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తనకు కేటాయించిన కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, మంత్రులు,అధికారులు హాజరై డీఎస్‌ను అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్‌ మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. ప్రధానంగా హైకోర్టు విభజన, ఉద్యోగుల ఇభజన లాగే ఉందన్నారు. ఇవన్నీ పాజిటివ్‌గా చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. సీఎం కేసీఆర్‌ కోరుకున్న విధంగా న్యాయబద్దంగా సమస్యలను పరిష్కరిస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రతో ఇరిగేషన్‌ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. తానొక విజనరీ అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు సమస్యల పరిష్కారానికి ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తీరేంటో తనకు అర్థం కావడంలేదన్నారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్లం సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తమకు తెలియదా? అని అన్నారు. సదుద్దేశంతో ముందుకు పోతే సమస్యలు అవే పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ఏ రకమైనా బంగారు తెలంగాణను చూడాలనుకున్నామో తప్పకుండా అలాంటి బంగారు తెలంగాణను చూస్తామన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నత శ్రేణి నేతగా, పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన డీఎస్‌ కొద్ది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్‌ చేస్తోన్న మహా

యజ్ఞంలో భాగస్వాముడిని అయ్యేందుకే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని డీఎస్‌ ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించిన డిఎస్‌ను మంత్రులు  లక్ష్మారెడ్డి తదితరులు అభినందించారు.