జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల
న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతోన్న లక్షలాది మంది విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో జేఈఈ మెయిన్ (సెషన్ 1), ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడిరచింది. అయితే, ఈ పరీక్షలు జరిగే కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్ సెషన్ -1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. సెషన్-2 పరీక్షకు జనవరి ఆఖరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యేలా ఎగ్జామ్ సిటీల సంఖ్యను పెంచేందుకు కృషిచేస్తున్నామని.. దివ్యాంగ అభ్యర్థుల అవసరాలను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంది. జేఈఈ (మెయిన్) 2026 పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాలని ఎన్‌టీఏ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. తద్వారా దరఖాస్తుల ప్రక్రియ, తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని, దరఖాస్తుల తిరస్కరణ, తదితర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.