గాంధీ కుటుంబం దేశానికి స్ఫూర్తినిచ్చింది
` రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కులగణన చేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం
` ఎమ్మెల్యేల అర్హత వయస్సు 21 ఏళ్లకు కుదించాలి
` ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
` రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): మన దేశంలో అన్ని మతాల సహజీవనం స్ఫూర్తినిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం కూడా దేశానికి అదే విధంగా స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభ నిర్వహించారు. రాజీవ్ చిత్రపటం వద్ద సీఎం, మంత్రులు నివాళులర్పించారు. ‘‘గత 35 ఏళ్లుగా రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర జరుగుతోంది. గాంధీ.. దేశానికి పర్యాయపదం. తమపై పోరాడిన మహాత్మాగాంధీని బ్రిటిషర్లు ఏమీ చేయలేకపోయారు. స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వవాదులు ఆయన్ను పొట్టనపెట్టుకున్నారు. గాంధీని హత్య చేసిన వారు బ్రిటీషనర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. దేశ సమగ్రత, సమైక్యత కాపాడటానికి ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కులగణన చేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం అన్నారు. ఎమ్మెల్యేల అర్హత వయస్సు 21 ఏళ్లకు కుదించాలని, ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు.