అనుమతించండి.. లేదా పరిష్కారం చూపండి
రాష్ట్ర కార్యదర్శి నారాయణ
తెలంగాణ మార్చ్‌కి సీపీఐ మద్దతు
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (జనంసాక్షి): ఈ నెల 30న జరగనున్న తెలంగాణమార్చ్‌కి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి అయినా ఇవ్వాలి లేదా.. సమస్యకు రాజకీయ పరిష్కారమైనా చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. తెలంగాణ మార్చ్ అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఖండించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా జరిగే మార్చ్‌కి అనుమతి ఇవ్వకుండా లేని పోనీ అపోహలు సృష్టిస్తూ ఉద్రిక్త వాతావరణం కలిగేందుకు ప్రభుత్వం తీరు ఉందని ఆయన విమర్శించారు. మార్చ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తే ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోవని ఆయన అన్నారు. అలాకాకుండా అరెస్టులు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల పరిస్థితి మరింత జఠిలమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌కి సీపీఐ సంపూర్ణ మద్ధతు ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ శ్రేణుల పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అంశానికి సంబంధించి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు లేఖ ఇవ్వడం మంచి పరిణామమేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అఖిలపక్ష సమావేశంలో మళ్ళీ మాట మార్చకుండా ఉండాలని అన్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై తన వైఖరీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలా కానీ పక్షంలో సమావేశాన్ని జరగనీయబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్‌కు అడ్డే లేదన్నారు. చంద్రబాబు లేఖ ఇవ్వలేదనడం కేవలం ఒక సాకు మాత్రమేనని అన్నారు. తెలంగాణ ఇవ్వాలనుకుంటే వందమంది చంద్రబాబులు అడ్డోచ్చినా కాంగ్రెస్ లెక్కచేయదని నారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ జిత్తులు చిత్తయ్యాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కపట వైఖరికి తాజా పరిణామాలే నిదర్శనమని ఆయన అన్నారు.