గ్రీన్‌కార్డులకూ ఎసరు..

` పునరుద్ధరణలో తీవ్ర జాప్యంతో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితుల్లో కార్డుహోల్డర్లు
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలో ట్రంప్‌ సర్కారు వచ్చిన తర్వాత గ్రీన్‌కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే.. వీటిల్లో వీసాలు, గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు ఆ దేశ కార్పొరేట్‌ రంగంపై దుష్ప్రభావం చూపడం మొదలుపెట్టింది. వివిధ రంగాల్లోని కార్పొరేట్‌ లీడర్లు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల వర్క్‌ పర్మిట్‌లు ముగియడం.. వాటి పునరుద్ధరణ వెంటనే జరగకపోవడంతో వారు పదవుల నుంచి వైదొలగాల్సి వస్తోంది. ముఖ్యంగా శాశ్వత నివాసం కల్పించే గ్రీన్‌కార్డ్‌ల జారీలో జాప్యం వల్ల.. సక్రమమార్గంలో దేశంలోకి వచ్చి కొన్నేళ్లుగా వివిధ కంపెనీల్లో పని చేస్తున్నవారు కూడా వెళ్లిపోయేటట్లు చేస్తోంది. అమెరికాలోనే అతిపెద్దదైన మెట్రోపాలిటన్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ అథారిటీ (మార్టా) సీఈవో కొల్లిన్‌ గ్రీన్‌వుడ్‌ జులై 17న పదవి నుంచి వైదొలిగారు. ఆయనకు వర్క్‌పర్మిట్‌ కాలవ్యవధి ముగిసిపోవడం.. గ్రీన్‌కార్డ్‌ జారీలో జాప్యంతో ఆయన తన పదవిలో కొనసాగడం అసాధ్యంగా మారింది. దీంతో ముందస్తు రిటైర్మెంట్‌ను ఆయన ఎంచుకొన్నారు. ఆయన స్వస్థలం కెనడా. తమ సీఈవోకు గ్రీన్‌కార్డ్‌ త్వరలోనే వస్తుందని మార్టా చెప్పినా.. పదవిని వీడేందుకే గ్రీన్‌వుడ్‌ మొగ్గు చూపారు. వాస్తవానికి గ్రీన్‌వుడ్‌ మార్టా సీఈవోగా 2022 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాత కంపెనీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడిరది. ఆయన ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజ్డ్‌ డాక్యుమెంట్‌ జూన్‌ 18నే ముగిసిపోయింది. అయినా కానీ, ఆయన గ్రీన్‌కార్డ్‌ వచ్చేవరకు కెనడా వీసాపై అమెరికాలో కొనసాగుతారని మార్టా పేర్కొంది. అమెరికా రవాణారంగంలో పలువురు హైప్రొఫైల్‌ అధికారులు రాజీనామాల పరంపరలో గ్రీన్‌వుడ్‌ది కూడా ఒకటి. వీరిలో చాలామంది ఆపరేషనల్‌ సవాళ్లు, ఇమిగ్రేషన్‌ టైమ్‌లైన్‌ వంటి కారణాలతో ఉద్యోగాలను వదిలేశారు.
భారతీయులకు గ్రీన్‌కార్డుల్లో భారీ జాప్యం..
అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్న భారతీయులు.. ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్‌ బ్యాక్‌లాగ్‌లో 1.13 కోట్ల దరఖాస్తులున్నాయి. ఈ స్థాయిలో పెండిరగ్‌లో ఉండటం ఓ రికార్డ్‌. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చి చేరనున్నాయి. ఇటీవల యూఎస్‌ సీఐఎస్‌ ప్రచురించిన డేటాషీట్‌లో ఈ వివరాలున్నాయి. ఇక రెండో త్రైమాసికంలో ప్రాసెస్‌ చేసిన దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 3.3 మిలియన్లు చేయగా.. ఈసారి 2.7 మిలియన్లకే పరిమితమైంది. ఇక గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తుదారులు వాడే ఫారమ్‌ ఐ-90 సగటు వెయిటింగ్‌ టైమ్‌ 0.8 నెలల నుంచి 8 నెలలకు చేరింది. ఫారమ్‌ ఐ-765ల్లో దాదాపు 2 మిలియన్ల దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయి.