బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం
` రాజధాని ఢాకాలో పాఠశాలపై కూలిన యుద్ధ విమానం..
` ఘటనలో 19 మంది మృతి
` మృతుల్లో 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు
` అన్ని విధాలుగా అండగా ఉంటాం..
` సాయం చేసేందుకు సిద్ధం: ప్రధాని మోదీ
ఢాకా(జనంసాక్షి): బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మైల్‌స్టోన్ పాఠశాలపై ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ యుద్ధ విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పైలట్‌తోపాటు 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 50 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పాఠశాలలో విద్యార్థులు ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడంతో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు స్థానిక మీడియా వెల్లడిరచింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడి దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది. మరోవైపు ఎఫ్-7బీజీఐ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
సాయం చేసేందుకు సిద్ధం: ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్ అండగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ప్రమాద వార్త తెలిసి షాక్‌కు గురయ్యా. మృతుల్లో చాలా మంది యువ విద్యార్థులు ఉన్నారు. చాలా బాధ అనిపించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మోదీ అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ యుద్ధ విమానం ఢాకా సమీపంలోని పాఠశాలపై కూలిపోయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పైలట్‌తోపాటు 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.