ఆ 12 మంది నిర్దోషులే..
` ముంబయి రైలు పేలుళ్లు కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు
` అభియోగాలను నిర్ధరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున ధర్మాసనం నిర్ణయం
ముంబయి(జనంసాక్షి):దాదాపు రెండు దశాబ్దాల క్రితం ముంబయిలో జరిగిన రైలు పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.2006లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో శిక్ష పడిన 12 మందిని తాజాగా నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై ఉన్న అభియోగాలను నిర్ధరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారిని నిర్దోషులుగా తేల్చినట్లు తీర్పు వెలువరించింది. వీరిలో ఉరిశిక్ష పడిన ఖైదీలు కూడా ఉండటం గమనార్హం. ఆ పేలుళ్లలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు.2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వేలైన్‌లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన ఈ మారణహోమంలో 189 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబరులో ప్రత్యేక కోర్టు.. 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల్లో కమల్ అన్సారీ అనే వ్యక్తి 2021లో కొవిడ్ కారణంగా నాగ్‌పుర్ జైల్లో మృతి చెందాడు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించారు. వాటిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. 2015 నుంచి ఈ అంశం ఉన్నత న్యాయస్థానంలో పెండిరగ్‌లో ఉంది. దీనిపై అనేక అభ్యర్థనల తర్వాత 2024 జులైలో రోజువారీ విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్‌ను హైకోర్టు ఏర్పాటుచేసింది. అప్పటినుంచి విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం సంచలన తీర్పునిచ్చింది. నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది. నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది.