పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

హైదరాబాద్ (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు విచారణ జరగనుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గల డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ నందు రూమ్ నెం. 216, 219, రెండో ఫ్లోర్‌లో ఉదయం 10 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుందని, ఈ విషయాన్ని నోడల్ అధికారి ఎం శ్రీనివాసులు ఐపీఎస్ బాధిత రైతులందరూ హాజరుకావాల్సిందిగా సూచించారని రైతుల పక్షాన ఎన్‌హెచ్‌ఆర్‌సీకి పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రామారావు ఇమ్మనేని తెలిపారు. ఈ సందర్భంగా రైతులపై బనాయించిన అక్రమ కేసులు, చేతులకు బేడీలు వేసి తరలించడం, పంచాయతీ అనుమతుల్లేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం పనులకు పూనుకోవడం, గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రి ప్రైవేటు సైన్యాన్ని మోహరించడం, బౌన్సర్ల చేత స్థానిక మహిళలపై దాడి చేయడం, దాడిచేసిన బౌన్సర్లపై, వారిని ఉసిగొల్పిన ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి కేసులు నమోదుకాకపోవడం తదితర అంశాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఆయా గ్రామాల రైతులు ఫిర్యాదు చేయనున్నారు. పబ్లిక్ హియరింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే.