అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారిన హుజూర్ నగర్
ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు
అంతుచిక్కని ఓటరునాడి
సూర్యాపేట,అక్టోబర్4(జనంసాక్షి) : హుజూర్‌నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారింది. అధికార టిఆర్‌ఎస్ దీనినిగెలు/-చుకోవడం ద్వారా తన ప్రతిష్టను ఇనుమడింప చేసుకోవాలని చూస్తోంది. తమకు తిరుగులేదని చెప్పాలంటే ఇక్కడ గెలుపు ఆ ఆపర్టీకిఅనివార్యంగా మారింది. ఇక ఈ సీటును తిరిగి నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగామారింది. తిరిగి ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూలత ఉంటుంది. అలాగే బిజెపి తన ఉనికి నిరూపించు కునేందుకు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టగా తీసుకుని ప్రచారం చేస్తోంది. మొత్తంగా ఈ మూడు పార్టీలకు ఇది ప్రతిష్టగా మారగా, కమ్యూనిస్టులు తోకపార్టీగా మారి, టిఆర్‌ఎస్ వెన్నంటి నడవబోతున్నాయి. ఎన్నికల శంఖారావం ప్రారంభమైనప్పటి నుంచి ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా ప్రచారంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదే. ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతుండడంతో ఈ సారి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టకడతారో..? హుజూర్‌నగర్ ఎవరికి దక్కనుందో.. అన్న ఉత్కంఠ నెలకొంద. 2 నెల 21న ఎన్నికజరుగనుండగా 24న ఓట్ల లెక్కింపుతో తేలనుంది. 1952లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 1972 ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గం రద్దయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మళ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు పీడీఎఫ్, ఐదుసార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే.. స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. 2009 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పోటీ చేస్తూ వస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అప్పట్లో పీడీఎఫ్ విజయ దుందుభి మోగించింది. ద్విసభ నియోజకవర్గమైన హుజూర్‌నగర్ నుంచి ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు జయసూర్య, టి.నర్సింహులు విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పాటైన పదేళ్ల తర్వాత హుజూర్‌నగర్‌పై కాంగ్రెస్ జెండా
ఎగిరింది. అక్కిరాజు వాసుదేవరావు ఈ నియోజకవర్గ తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యే. 1962 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే 25,394 ఓట్లు రాగా సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచిన దొడ్డ నర్సయ్యకు 22,561 ఓట్లు పడ్డాయి. పునర్విభజనతో ఈ నియోజకవర్గం నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్‌నగర్, మేళ్లచెరువు మండలాలతో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత 2016లో నేరేడుచర్ల నుంచి పాలకవీడు, మేళ్లచెరువు నుంచి చింతపాలెం మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటితో కలిపి నియోజకవర్గంలో ఏడు మండలాలయ్యా యి. పునర్విభజనతో ఏర్పాటయిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో హస్తందే ఆధిపత్యం కొనసాగింది. 2009లో జరిగిన ఎన్నికల్లో నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్‌ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఉత్తమ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్, టీఆర్‌ఎస్ నుంచి కాసోజు శంకరమ్మ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 69,879 ఓట్లు పడగా శంకరమ్మకు 45,955 ఓట్లు వచ్చాయి. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్.. కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ఆపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శానంపూడి సైదిరెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్‌కు 92,966 ఓట్లు రాగా, సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఉత్తమ్ 7,436 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్వల్ప ఓట్ల తేడాతో ఉత్తమ్ గ్టటెక్కారు.అయితే ఈసారి విజయం తమదేనని ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు ధీమాగా చెబుతున్నాయి. మొత్తంగా ప్రజలు ఈ సారి ఎటు ఓటేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. నాడి పట్టుకోవడం కూడా అంత సులువుగా లేదు.