అన్యాక్రాంత భూమిని దళితునికి స్వాధీనం
యర్రగొండపాలెం , జూలై 10 : గత 10 సంవత్సరాల క్రిందట అక్రమంగా అన్యాక్రాంతమైన ఒక దళితుని భూమిని హైకోర్టు ఆదేశాల మేరకు యర్రగొండపాలెం తహసీల్దారు శనివారం స్వాధీనం చేశారు. యర్రగొండపాలెంకు చెందిన దర్శనం నాగయ్య అనే వ్యక్తికి 1976లో కుటుంబ నియంత్రణ పథకం క్రింద ఆనాటి ప్రభుత్వం సర్వే నెంబర్ 904లో సుమారు 5 ఎకరాల 20 సెంట్ల భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. అప్పట్లో కొంతకాలం సాగు చేసిన ఆయన గత పది సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తికి ప్రైవేటు స్కూల్ నిర్వహణకు ఆ భూమిని లీజుకు ఇవ్వగా ఆ వ్యక్తి నాగయ్యకు తెలియకుండానే పలువురికి అక్రమంగా అమ్మకాలు జరిపాడు. విషయం తెలుసుకున్న నాగయ్య తన భూమిని స్వాధీనం చేయాలని హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సంబంధిత బాధితుని రికార్డులను పరిశీలించి నాగయ్యకే భూమి దక్కాలని యర్రగొండపాలెం తహసీల్దారును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం తహసీల్దారు అశోక్‌వర్ధన్ ఆధ్వర్యంలో సర్వేయర్ సంజీవయ్య, విఆర్‌ఓ తిరుపతిరెడ్డిలు భూమిని సర్వేచేసి నాగయ్యకు స్వాధీన పరిచారు.