అప్రజాస్వామిక తెలంగాణ
– చలో అసెంబ్లీపై నిర్భందకాండ
– అడుగడుగున అరెస్టులు
– చుక్కా రామయ్యకు సైతం నిర్భంధం
– గన్ పార్కు వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
– ఓయూలో ఉద్రిక్తత
హైదరాబాద్,సెప్టెంబర్30(జనంసాక్షి): హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో మరోమారు నిర్బంధకాండ కొనసాగింది. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తరుణంలో నాటి సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అనుసరించిన నిర్బధకాండను మించి నిర్బంధాన్ని అమలు చేశారు. పోలీసులు పూర్తి నిరంకుశంగా వ్యవహరించి అసెంబ్లీ ముట్టడికి వచ్చే వారిని గృహనిర్బంధం చేయడంతో పాటు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ప్రజాసంఘాలు, లెఫ్ట్ పార్టీలు పిలుపునివ్వడంతో అసెంబ్లీ సమావేశాలకు పోలీసు ఉన్నతాధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటుచేశారు. చుక్కారమయ్య, వరవవరరావు సహా అనేకమందిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ ప్రజాసంఘాలు, వామపక్షాలు బుధవారం ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అదేవిధంగా 18 విద్యార్థి సంఘాలు కూడా ఛలో అసెంబ్లీని చేపట్టాయి. దీంతో అప్రమత్తమైన విద్యార్థి నాయకులతో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలకు చెందిన పలువురి నేతలను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అన్ని జిల్లాల సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎవరిని కూడా రాకుండా అడ్డుకున్నారు.
ఉద్రిక్తంగా ఉస్మానియా క్యాంపస్
చలో అసెంబ్లీ దృష్ట్యా హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ నాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. అధ్యాపకుల క్వార్టర్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాగా ఉస్మానియా యూనివర్శిటీలో రాత్రి సోదాలు నిర్వహించి సుమారు ముప్పై మంది విద్యార్దులను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లో జరిగిన శృతి, విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్‌పై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం తెలంగాణ ప్రజాస్వామ్యవేదిక ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్మానియా వర్శిటీ మహిళా విద్యార్థులంతా ఓయూ హాస్టల్ నుంచి ఎన్‌సీసీ గేట్ వరకు ర్యాలీగా వచ్చి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఈ సందర్భంగా విద్యార్ధినిలు మాట్లాడుతూ శృతి, సాగర్‌లది బూటకపు ఎన్‌కౌంటర్‌ని, శృతిపై యాసిడ్ పోసి చాలా హీనంగా పోలీసులు హింసించి చంపారని ఆరోపించారు. శృతికే అలా జరిగితే మామూలు అమ్మాయిల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. విద్యార్థుల శవాలపై కేసీఆర్ కూర్చొని పాలన చేస్తున్నారని వారు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చలో అసెంబ్లీకి బయలుదేరిన విరసం నేత వరవరరావును హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొ. వినోద్‌కుమార్, ప్రొ.విశ్వేశ్వర్‌రావును, పాతబస్తీలో ఎంబీటీ నాయకుడు అంజద్ ఉల్లాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
విద్యావేత్త చుక్కా రామయ్య గృహనిర్బంధం
వరంగల్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య డిమాండు చేశారు. విద్యానగర్‌లో ఉన్న చుక్కా రామయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య విూడియాతో మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆద్వర్యంలో జరపతలపెట్టిన చలో అసెంబ్లీకి అనుమతి లేని కారణంగా ఆ ఆందోళనలో పాల్గొంటారన్న భావనతో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను గృహ నిర్భందంలో ఉంచారు. విద్యానగర్ లోని ఆయన నివాసంలోనే రామయ్యను కట్టడి చేయడం విశేషం. హైదరాబాద్‌కు వచ్చే వివిధ మార్గాలలో ముఖ్యంగా వరంగల్ జిల్లా వైపు నుంచి వచ్చే వాహనాలపై నిఘా పెట్టారు. వామపక్ష నేతలను స్టేషన్ ఘనపూర్ వద్ద ,జనగామ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి అడవులలో బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా 375 సంస్థలతో కూడిన వేదిక ఆద్వర్యంలో ఈ చలో అసెంబ్లీ తలపెట్టారు. వరంగల్ జిల్లా తాడ్వాయి అడవులలో బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా వామపక్షాలు,ప్రజాసంఘాల చలో అసెంబ్లీ ఆందోళన సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తంగా మారింది పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేని కారణంగా ర్యాలీ చేయడానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో ఆందోళనకారులు రోడ్డు విూదే భైటాయించారు. విప్లవ కవి వరవరరావును ఆర్టిసి క్రాస్ రోడ్డులో అరెస్టు చేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాగా ఉస్మానియా యూనివర్శిటీ నుంచి చలో అసెంబ్లీకి బయల్దేరిన విద్యార్ధులను కూడా గేట్ వద్ద అడ్డుకున్నారు.అప్పుడు కూడా కొంత ఉద్రిక్తత ఏర్పడింది.ఎన్ని నిర్భందాలు అమలు చేసినా తమ ఆందోళన ఆగదని సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. పోలీసులు ఉద్యమ నేతలను,ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. అసెంబ్లీ ముట్టడికి ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం హైద్రాబాద్‌కు వస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేశారు. దీంతో పలు చోట్లు ఉద్రికపరిస్థితులు నెలకొన్నాయి.
గన్‌పార్క్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
గన్‌పార్కు వద్ద రాజ్‌కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్టులకు నిరసనగా రాజ్‌కుమార్ అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకుని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.