అభివృద్ధికి నోచుకోని వార్డు.. గాడి తప్పిన లక్ష్యం..

 కుంగదీస్తున్న ప్రణాళికారాహిత్యం
డోర్నకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి)
                  డోర్నకల్ మున్సిపాలిటి పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందంగా ఉంది. మేజర్ గ్రామపంచాయితీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ జరిగిన అంతుకు తగిన సదుపాయాలు సమకూర్చు విశయంలో పాలకుల వైఫల్యం చేందటంతో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.ఆరంభంలో ఉన్న ఆర్భాటం…ఆచరణలో తప్పటడుగులేస్తుంది. ఇతర మున్సిపాలిటీలా ఆశించిన మేరకు పట్టణ డెవలప్మెంట్ జరుగగా పోవటంతో పట్టణ పురోగతి కనిపించటం లేదు.పట్టణ ప్రజలు ఆవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.క్రమపద్ధతి,ప్రణాళిక లోపించడంతో పట్టణీకరణ పలు సమస్యలను సృష్టిస్తోంది.జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మున్సిపాలిటీ అని చెప్పక తప్పదు.
మున్సిపల్ మొదటి వార్డు ప్రజల అవస్థలు వర్ణనాతీతం.పారిశుద్ధ్యం ఎరగని కాలనీలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.సరైన మురికి కాలువలు,అంతర్గత రోడ్ల నిర్మాణం జరగక వానకాలం వచ్చిందంటే బురదలో బ్రతకాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.నివాసాల వెంబడి దట్టమైన చెట్ల పొదలు రాత్రి అయితే చాలు విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని భయాందోళన గురౌతున్నారు.అప్పుడప్పుడు చెత్త బండి పలకరిస్తుంది.ఇటీవల బురద రోడ్డుమీద నాట్లు వేసి నిరసన తెలిపినట్లు ఆ ప్రాంతవాసులు పేర్కొన్నారు.ప్రజలను ముక్కు పిండి పన్ను వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ కనీస సౌకర్యాలు కల్పించడంలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకటో వార్డు పరిధిలోని బ్రాహ్మణ కుంటలో డ్రెయినేజీలు కనిపించవు.మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించాల్సిందే.ఇండ్ల పరిసరాల్లో మురుగునీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలవుతున్నా.. పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడంలో పురపాలక అధికారులు విఫలమయ్యారు.దోమలు పెరిగి ఇప్పటికే పలువురు విషజ్వరాల బారిన పడ్డారు.దోమల నివారణకు చేసే ఫాగింగ్‌ గురించి అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. వార్డులో ఖాళీ ప్లాట్లు ఉండడంతో విపరీతంగా చెట్లు పెరిగి దోమలు విజృంబిస్తున్నాయి.వరహాల బెడదతో ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు వాపోతున్నారు.కనీసం దుర్వాసన వెదజల్లుతున్న ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా చల్లడం లేదు.ఇప్పటికైనా పారిశుధ్య నిర్వహణ,డెవలప్మెంట్ పై శ్రద్ధ వహించాలని బ్రాహ్మణ కుంట వాసులు కోరుతున్నారు.
భరించలేం… దోమలతో వేగలేం : శశికళ
తలుపు తెరిచిపెడితే దోమలు,మురుగు కంపు భరించలేకపోతున్నం.దోమలు,పందులు,కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.అధికారులకు, వార్డ్ కౌన్సిలర్ కు ఎన్ని సార్లు మొరపెట్టిన స్పందన కరువైంది.పేరుకే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కంటే అధ్వానం.దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు భయమేస్తుంటుంది.మురికి కాలువలు లేక వర్షపునీరు నిలిచి దోమలు పెరుగుతున్నాయి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి.రాత్రి నిద్రపోలేకపోతున్నాం.వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలి.మురికి కాలువ లేక పరిసర ప్రాంతాల నీరు ఇండ్ల ముందు నిలుస్తుంది.పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది.ఇంటికి బంధువులు వస్తే ఉండలేని పరిస్థితి నెలకొన్నది.ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు,ప్రజా ప్రతినిధి పట్టించుకోవడం లేదు.నేటికి సమస్యలు బావిలో కప్పలా ఉన్నవి.
మొదటి వార్డుకు 23 లక్షల అభివృద్ధి పనులు జరిపినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు.20 కోట్ల నిధుల నుంచి 10 లక్షల వ్యయంతో 300 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణం.ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా 6 లక్షల వ్యయంతో 120 మీటర్ల సిసి రోడ్డు,4 లక్షలతో 120 మీటర్ల సైడ్ డ్రైన్ నిర్మించినట్లు తెలిపారు.హరితహారంలో 600 మొక్కలకు లక్షలు వెచ్చించి నాటారు.బ్రతికిన వాటికంటే చనిపోయిన అత్యధికమంటున్నారు.
252 గృహాలు,962 జనాభా కలిగిన వార్డు అభివృద్ధి నత్తను మించి సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.వివిధ పన్నుల రూపంలో ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న అభివృద్ధి శూన్యం.అనేక పర్యాయాలు సిసి రోడ్లు,సైడ్ కాలువలు నిర్మాణం చేపట్టాలని వార్డు కౌన్సిలర్ కు మొరపెట్టిన అభివృద్ధి చేయలేదని అక్కడి పౌరులు వాపోతున్నారు.పందుల గుంపులు, దోమల బెడద,మురుగు కంపుతో ఆ ప్రాంత ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.కౌన్సిలర్ వీధిలో ఇటీవల ఓ అపరిచితుడు అర్ధరాత్రి గోడలు దూకి ఇళ్లల్లోకి ప్రవేశించుటకు యత్నించాడు.స్థానిక పౌరులు అప్రమత్తంతో అతగాడు అక్కడి నుంచి జారుకున్నాడు.సీసీ కెమెరాలు లేకపోవడం పోకిరిల వెకిలి చేష్టలకు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కెమెరాలు ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.
కౌన్సిలర్ నిర్లక్ష్యం కారణంగానే అభివృద్ధి జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కౌన్సిలర్ కొండేటి హేమచంద్రశేఖర్ ను జనం సాక్షి ప్రతినిధి వివరణ కోరగా.. తమ వార్డు ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే.నిఘనేత్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాను.బ్రాహ్మణ కుంట ప్రజలు సిసి రోడ్లు,మురికి కాలువలు,పారిశుధ్యం సక్రమంగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తమ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఎమ్మెల్యే రెడ్యానాయక్,చైర్మన్ వీరన్న దృష్టికి తీసుకు వెళ్లాను.ఈ విడత నిధులతో ఆ ప్రాంత డెవలప్మెంట్ కు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.