అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : గ్రామాల అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామజ్యోతి ద్వారా అన్ని రకాల నిధులను పంచాయతీ ఖాతాలో జమ చేస్తామన్నారు.
ఈ నిధులతో సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి చేపడతామని మంత్రి తెలిపారు. కాగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ జిల్లాలో అఖిల పక్షాలు చేపట్టిన దీక్ష ఆయా పార్టీల మనుగడ కోసమేనని మంత్రి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని తాండూరు, చేవెళ్ల ప్రాంతాలకు నీరందిస్తామన్నారు.