అమరావతి రైతుల పాదయాత్రకు శ్రీకారం

45రోజుల పాటు సాగనున్న మహాపాదయాత్ర
45రోజులపాటు సాగి డిసెంబర్‌ 17న తిరుపతిలో ముగింపు
మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు
అమరావతి,నవంబర్‌1  (జనంసాక్షి)  : ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంత రైతులు తలపెట్టిన ’మహా పాదయాత్ర’ ప్రారంభమైంది. ’న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో ప్రారంభించిన ఈ యాత్రకు తుళ్లూరులో శ్రీకారం చుట్టారు. ఇది తిరుపతి వరకు కొనసాగనుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు నిర్వహించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పాదయాత్ర.. మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల విూదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియ నుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు.
వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాల మద్దతు పలికాయి. పలుపార్టీల నేతలు పాల్గొని వారితో నడిచారు.
అమరావతి రైతులు ప్రారంభించిన ఈ పాదయాత్రకు అధికార వైకాపా మినహా దాదాపు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. తెదేపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, అమరావతి బహుజన ఐకాస, దళిత బహుజన ఫ్రంట్‌ తదితర రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు సంఫీుభావం ప్రకటించాయి. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి తెదేపా తరఫున ఆ పార్టీ సీనియర్‌ నేతలు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నేతలు తెనాలి శ్రవణ్‌కుమార్‌, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేవరకు తమ మద్దతు కొనసాగుతుందని తెదేపా నేతలు తెలిపారు.
కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి, సిపిఐ నేత అనరూరాధ తదితరులు కూడా పాదయాత్రలో కలసి నడిచారు.
రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఫీుభావం తెలిపారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. అవమానాలెదురైనా ఆశయ సాధన కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రతీకారాలు, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ రాష్టాభ్రివృద్ధిపై లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రివర్స్‌ పాలనకు తెరలేపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.