అమృత్ పథకానికి తెలంగాణలో 11 నగరాలు
– పరిశీలనలో సిద్ధిపేట: వెంకయ్య
హైదరాబాద్ ఆగష్టు 23 (జనంసాక్షి):
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ పథకం కింద రాష్ట్రం నుంచి 11 నగరాలు ఎంపిక చేశామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అమృత్ పథకానికి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, రామగుండం, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, ఆదిలాబాద్ నగరాలు ఎంపికయ్యాయని చెప్పారు. ఈ పథకం కింద సిద్ధిపేట పరిశీలనలో ఉందన్నారు.దేశ వ్యాప్తంగా అమృత్ పథకం కింద 500 నగరాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలో హెరిటేజ్ నగరం కింద వరంగల్‌ను ఎంపిక చేశామని పేర్కొన్నారు. రాజీవ్ ఆవాస్ యోజన కింద నిర్మాణం ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమంగా చూస్తోందని స్పష్టం చేశారు. టీమ్ ఇండియాగా పని చేయాలన్నదే లక్ష్యమని ఉద్ఘాటించారు. స్మార్ట్ సిటీల ఎంపిక పూర్తయింది.. అక్టోబర్ 1న అధికారికంగా ప్రకటిస్తామన్నారు. స్మార్ట్ సిటీగా ఎంపికైన ఒక్కో నగరానికి రూ. 200 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.