అలాంటి భర్త నాకు అక్కర్లేదు.. ఆగిన పెళ్లి
నిజామాబాద్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అదనపు కట్నం కారణంగా ఆగిపోయింది. తనకు అదనంగా మరో రెండు లక్షలు కట్నం కావాలని వరుడు డిమాండ్ చేయడంతో ఇలాంటి భర్త తనకవసరం లేదని వధువు తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్‌లోని ఎఫ్‌సీఐ కాలనీ (ఆర్యనగర్)కు చెందిన మీనాక్షి వివాహం జక్రాన్‌పల్లికి చెందిన సాయికుమార్‌తో శుక్రవారం జరగాల్సి ఉంది. వీరి నిశ్చితార్థం ఏడాది క్రితమే జరిగింది. కట్నకానుకల కింద వధువు సోదరుడు రూ.లక్షతో పాటు అర తులం బంగారం ఇచ్చారు. పెళ్లికి మూడు రోజుల ముందు పెండ్లి కొడుకు తనకు బైక్ కావాలని పేచీ పెట్టగా కొనిచ్చాడు. సంప్రదాయం ప్రకారం పెండ్లికి ఒకరోజు ముందు వరుడిని నిజామాబాద్ తీసుకువచ్చారు.
అయితే అతడికి స్వాగతం పలికేటప్పుడే గొడవ జరగడంతో అదే రోజు రాత్రి తన ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం తిరిగి రమ్మని ఆహ్వానించగా తనకు అదనంగా మరో రూ. 2 లక్షలు కట్నం ఇస్తేనే వస్తానని మొండికేశాడు. దీంతో పీటలపైకి వచ్చిన పెండ్లి ఆగిపోయింది. దీంతో వధువు తరఫు వారు నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పెండ్లికొడుకును అదుపులోకి తీసుకుని చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధు తెలిపారు. ఆ తర్వాత ఈ పెళ్లి తనకు ఇష్టమేనని వరుడు చెప్పగా.. ఇలాంటి భర్త తనకు అక్కర్లలేదని వధువు తేల్చిచెప్పటంతో పెండ్లి రద్దయింది.