అవినీతి క్యాన్సర్‌లాంటిది

బాజపా పాలిత రాష్ట్రాలు అవినీతిమయం
సోనియా ధ్వజం
మంగుళూరు, అక్టోబర్‌18: అవినీతి మహమ్మారి కేన్సర్‌ లాంటిదని యూపీఏ అధినేత్రి సోనియగాంధీ అన్నారు..పలు రాష్ట్రాల్లో బీజేపీ అవినీతికరమన ప్రభుత్వాలను నడుపుతోందంటూ సోనియా మండిపడ్డారు..గత కొంత కాలంగా అల్లుడు రాబర్ట్‌ వాద్రాపై వస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయి ఆత్మరక్షణలో పడ్డ సోనియా వ్యూహం మార్చి బీజేపీపై ఎదురుదాడికి దిగారు. గురువారం ఆమె మంగుళూరులో ఆమె మాట్లాడుతూ అవినీతి క్యాన్సర్‌పై అన్ని పార్టీల కన్నా తమ పార్టీయే ఎక్కువగా పోరాడిందని చెప్పుకొచ్చారు. అవినీతి క్యాన్సర్‌ లాంటిదని అందరికీ తెలుసని, దీని ప్రభావం పేదలపై అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. అవనీతిపై పోరులో యూపీఏ చేసినట్లుగా మరే పార్టీ చేయలేదని, అవినీతిపై పోరు విషయంలో చిత్తశుద్ధితో ఉన్న కారణంగానే ఆర్టీఐ(సమాచారహక్కు చట్టం)ను తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. అవినీతిపై పోరాటం చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్న బీజేపీది ఉత్త నటనేనన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌ తదితర ప్రాంతాల్లో ఆ పార్టీ అవినీతికరమైన ప్రభుత్వాలను నడపుతన్నదని ఆమె విమర్శించారు. కర్ణాటకలో అవినీతి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని ఆమె వెల్లడించారు. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు..దీని వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందన్నారు.