అసహ్యం
రాత్రి మూడింటి వరకూ చదువుతూ కుర్చుండటం వల్ల, లేచేసరికి పది దాటింది. ఒళ్లంతా వేడిగాను, బరువుగానూ తలంతా దిమ్ముగానూ మనస్సంతా డల్‌గానూ ఉంది. వొళ్లు నొప్పుల్ని సుతిమెత్తగా ఒత్తే ప్రియురాలిలా! కిటికీలో నుంచి వస్తున్న చలికా లం నాటి ఎండ.రాత్రి పారేసిన అరటి తొక్కల్తో సిగరెట్టు పీ కల్తో రూమంతా చిందరవందరగా గజిబిజిగా ఉంది. రాత్రి చదువుతూ, చదువుతూ నిద్రపోయినప్పటి పుస్తకమూ, కాళ్ల దగ్గరి బ్లాంకెట్టూ కింద పడిపోయి ఉన్నాయి. టేబుల్ ల్యాంపు వెలుగుతూనే ఉంది. లారెన్స్, ఇలియట్, నెరుడా, శ్రీశ్రీ, చలం, రావిశాస్త్రి నన్ను చూసి నవ్వినట్టుగా షెల్ఫ్‌లోని పుస్తకాలు తలుపు దగ్గర ఆరోజటి పేపరు పడి ఉంది. సెలవులు కనుక రూంమేట్ వాళ్ల ఊరెళ్లాడు. ఆయనుంటే రూం ఇలా చిందరవందరగా ఉండకపొయ్యేది. ఆయన లేస్తాడు కనుక సిగరెట్టు పీకల్తో అరటి తొక్కల్తో గది ఈ విధంగా ఉండకపొయ్యేది. సెలువులైన ఇంటికి వెళ్లలేదు తను. ఇలియెట్‌ని, నెరుడాని, శ్రీశ్రీని, చలాన్ని నమిలి మింగేయ్యాలని, ఓ అద్భుత కావ్యం రాయాలని, ఇంటికెళ్తే బంధువుల్తో స్నేహి తుల్తో ఓ క్షణం రికామీ ఉండదు. సెలవులు కనుక హాస్టల్‌లో భోజనం వగైరాలు ఏవీ లేవు, అయినా సిటీలో భోజనం చేస్తూ హాస్టల్లో ఉంటున్నాను. యూనివర్సిటీ ‘డి’ హాస్టల్ చిట్టచివరగా ఉన్న ఈ రూంలని ఎవరూ ఇష్టపడరు. ఎవరో నేనూ నా రూంమేట్ లాంటి వాళ్లు తప్ప. పదడుగులు వేస్తేనే వచ్చే రెండు క్యాంటీన్లు, ఎదురుగా కనిపించే ల్యాండ్ స్కేప్ గార్డెన్. టాగోర్ ఆడిటోరియం. దగ్గర్లోనే ఉన్న అమెరికన్ లైబ్రరీ. కామ్‌గా కనిపించే తార్రోడ్డు, పూల వాసనల్ని తీసుకొని వచ్చే అందమైన గాలి ఇదీ మా రూం వాతావరణం. ఈ రూం నాకు చాలా ఇష్టం. నాకోసం ఈ రూం సెలక్ట్ చేశాడు మా రూంమేట్. కాలకృత్యాలు ముగించుకొని ఆరోజు పేపర్ని తిరగేసి ప్రెస్ దగ్గరి క్యాంటిన్‌కి వెళ్లాను. మెట్ల కింద కుర్చీలు. చెట్ల సందుల్లో నుంచి వస్తున్న కొంత వేడి, కొంత నీడ ఆనందంగా ఉంటుందక్కడ. ఈ మధ్య ఈ టైంకి చాలాసార్లు ఈ క్యాంటీన్‌కి వెళ్తున్నాను. ఈ సమయానికి అక్కడ వేడివేడి సమోసాలు ఉంటాయి. నే వెళ్లగానే, నా ప్రమేయం లేకుండానే సలీం ముందుగా ముందుగా సమోసాలు, తరువాత టీ ఆ తరువాత సిగరెట్టు డబ్బా తెచ్చాడు. సిగరెట్టు ప్యాకెట్టు తీసుకొంటూ ఇరవై రూపాయల నోటిచ్చాను. పదమూడు రూపా యలు తిరిగి ఇచ్చాడు. పోస్ట్‌మన్ ఇవ్వాళ కూడా రాలేదు. రమణ ఊరెళ్తుంటే బాపుకి చెప్పి డబ్బు పంపించమని చెప్పాను. వాడు పోయి పదిరోజులైంది. ఇంతవరకు డబ్బులు రాలేదు. వాడితో చెప్పి పంపే బదులు ఓ కార్డుముక్క రాసినా బాగుండేది. వాడు చెప్పాడో లేదో. ఇంటికి ఉత్తరం రాయడమంటే మరీ బద్ధకం తనకు. ఎవరి దగ్గరనన్నా అప్పు తీసుకుంటాననుకొన్నారేమో. హైదరాబాద్‌లో ఓ నలుగురైదుగురు దగ్గరి బంధువులున్నా వాళ్ల దగ్గరెప్పుడు తను డబ్బులు తీసుకోలేదు. అత్యవసరం ఉంటే వాళ్ల దగ్గర తీసుకోమని నాన్న చెప్పాడు కూడా. బాపు వచ్చినప్పుడు తప్ప వాళ్ల దగ్గరికి ఎప్పుడూ వెళ్లలేదు. జేబులో డబ్బు తక్కువగా ఉన్నా, ఈ రోజు గడుస్తుందన్న ధైర్యం, అప్పు సంగతి రేపు పోస్ట్‌మన్ వచ్చి వెళ్లిన తరువాత ఆలోచిద్దామనుకొన్నాను. టైం చూస్తే పన్నెండవుతుంది. బ్రిటీష్ లైబ్రరీకి పోయి, సాయంకాలం వరకు అక్కడ చదువుకొని, సిద్ధార్థకి పోయి భోజనం చేసి రావాలని నా ప్లాన్. అందుకని లైబ్రరీకి బయల్దేరాను.సాయంత్రం ఆరుగంటల వరకు లైబ్రరీలో ఉండి, ఆకలి విపరీతంగా అన్పిం చడం వల్ల సిద్ధార్థ హోటల్‌కి బయల్దేరాను. ప్రశాంతంగా ఉండే సిద్ధార్థ హోటలన్నా, రణగొణధ్వ నుల్తో నిరంతరం మండే ఇరానీ హోటలన్నా కూడా ఇష్టమే తనకి. తనది విచిత్రమైన మనస్తత్వం. తన మనసెప్పుడూ ఏదో ఆలోచన ల్తో పరుగెడ్తూనే ఉంటుంది. ఓ అసంపూర్తి గీతమో, ఓ అసంపూర్తి కథో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాను. ఓసారి ఇలాగే ఆలోచి స్తూ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. మా దగ్గరి బంధువు ఒకామె రెండు మూడు సార్లు పల్కరించి చివరికి తట్టి పలకరించేవరకూ మాట్లాడలేదట. తరువాత ఏదో మాట్లాడాను. ఏం ఉంటాయి ఆమెతో తనకి మాటలు. తన మాటలు పొగమంచులా, మబ్బులు కమ్మిన ఆకాశం వలె అస్పష్టంగా ఉంటాయని అందరూ అంటారు. వాళ్లకి అర్థం కాకపోతే నేనేం చెయ్యాలి? ఆ తరువాత ఓ పదిరోజు లకి అమ్మ దగ్గరి నుంచి ఓ పెద్ద ఉత్తరం వచ్చింది. ఆ సాహిత్య మంతా చదివి పిచ్చివాడినైపున్నానని కొంచెం కోపంగానూ, మరీ బాధగానూ రాసింది అమ్మ. మా బంధువులపై కోపం వచ్చింది. ఈ ఆడవాళ్లు మరీ చిన్న విషయాల్ని గోరంతలు కొండతలు చేస్తారు. అలా అరగంట నడిచిన తర్వాత సిద్ధార్థ వచ్చేసింది. సిద్ధార్థలో భోజనం చెయ్యాలా లేక ముందుకెళ్లి ప్రశాంత్‌లో బిర్యానీ తినాలా సంశయం. సంశయాల కౌగిట్లోనే కాలం చచ్చిపోతూ ఉంది. చివరికి సిద్ధార్థలోకి దారితీశాను. ఈ హోటల్ ఇష్టమే కాని, ఈ హోటల్ మేనేజర్‌ని చూస్తేనే అసహ్యం నాకు. వాడి కళ్లనిండా వల్గారిటీ సముద్రాలు, వారు నోరు తెరిచినప్పుడల్లా మొసలి నోరు తెరిచినట్టుగా అనిపిస్తుంది.ఈ హోటల్‌కి తనెప్పుడూ ఒంటరిగా వస్తాడు. ఎవరితో సబంధం లేకుండా ఓ మూలకి కూర్చుని కాఫీ తాగడం తనకలవాటు. హోటల్నిండా నాలాంటి యువకులు. వాళ్లం తా హాయిగా, ఆనందంగా అమ్మాయిల్తో మాట్లాడుతూ కాఫీలు తాగుతున్నారు. తన గుండెల్లో గుండుపిన్ను కదుల్తున్న బాధ. అందరి యువకుల్లా తనెందుకు ఉండలేకపోతున్నాడు. వాళ్లలా తనెందుకు జీవితాన్ని లీడ్ చెయ్యలేకపోతున్నాడు. వాళ్లంతా ఆడవాళ్లతో హాయిగా నవ్వుతూ త్రుళ్లుతూ గడుపుతున్నారు. తనెం దుకిలా? చాలా మంది ఆడవాళ్లు తనతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించినా తనెప్పుడూ దూరంగానే ఉండేవాడు, ఎందుకో.
రెండు రోజుల క్రితం ఈ హోటల్లోనే జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు తన టేబిల్‌కి ఎదురుగా ఓ జంట కూర్చున్నారు. ఎక్కడా స్థలం లేక. హాయిగా సరదాగా మాట్లాడు కొంటున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా. ఇంకా వాళ్లకి పెళ్లి కాలేదని అర్థమైంది తనకి. సడెన్‌గా ఓ ప్రశ్న అడగాలనిపించి సీరియస్‌గా అడిగాను.
‘మీరు ఆమెను పెళ్లి చేసుకొంటారా, లేక సరదాగా తిరిగి ఊరుకొంటారా?’
‘ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాను’ కాన్ఫిడెంట్‌గా సమాధానం చెప్పాడు, ఏమాత్రం తత్తరపడలేదు.
తనైతే అలా చెప్పలేకపొయ్యేవాడు. తత్తర పడేవాడు, ఏదో అబద్ధం చెప్పేవాడు. ‘నీకెందుకూ’ అని కసిరికొట్టేవాడు.
భోజనం చేస్తూన్నానే కానీ, ఒంటరితనం ఫీలింగ్ మనస్సుని తొలచి వేస్తుంది. ఇంతమంది జనంలో మునిగిన తను ఒంటరే. ఇన్ని కేరింతల జలపాతాల మధ్య తను ఒంటరే. ఒంటరినన్న ఫీలింగ్ రాగానే భయం వేసింది. ఫర్నేసులోని బొగ్గులా ఒంటరితనం ఫీలింగ్ మనస్సు నిండా మండుతుంది. భోజనం అయిపోయింది కానీ ఫీలింగ్ అలాగే ఉంది.
ఒంటరితనం ఆలోచనల్లో మునిగిన నేను, నాకెదురుగా వచ్చి కూర్చున్న అమ్మాయిని గమనించనే లేదు. ఆ అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయనుకొంటాను. కొనదేరిన ముక్కు, ఎర్రటి పెదాలు, సూటిగా చూసే కళ్లు. అందంగా అన్పించింది.ఆమెకేసి అలాగే చూస్తూ కూర్చున్నాను. బేరర్ వస్తే ‘ఓ కాఫీ’ అని చెప్పాను. నా మాట పూర్తికాకముందే ‘రెండు కాఫీ’ తీసుకురమ్మని చెప్పింది. ఆలోచనల్లో పడిపోయాను. ఆమెతో ఎక్కడా పరిచయం ఉన్నట్లుగానీ, ఎక్కడా చూసినట్లుగానీ అన్పించ లేదు. ఆమె గొంతు మధురంగా అన్పించింది తనకి.
‘మీ పేరు రమేశ్ కదూ’ అంది.
‘అవును’ అన్నాను. టేబిల్ మీద ఉన్న పుస్తకంపై చూసి చెప్పిందనుకొన్నాను.
ఎంత ఆలోచించినా ఆమె ఎవరో గుర్తుకు రాలేదు. అదే విషయం ఆమెతో చెప్పాను. ఆమె నవ్వింది. అలా అడిగి ఉండాల్సింది కాదనుకొన్నాను. ఎవరన్నా దూరం బంధువేమో అనుకొన్నా. నా గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకొంది. దాంతో ఇదివరలో పరిచయం ఉన్న మనిషి కాదన్న విషయం అర్థమైంది.
(మిగతా వచ్చే బుధవారం సంచికలో)