ఆంధ్రాపాలకుల నిర్లక్ష్యం వల్లే అసంపూర్తి ప్రాజెక్టులు
– 40 ఏళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి కాలేదు
– కొప్పులకు మంత్రి పదవి
– మొక్కలను కాపాడే బాధ్యత పంచాయతీరాజ్ వ్యవస్థదే
– సీఎం కేసీఆర్
ఆదిలాబాద్/ కరీంనగర్, జూలై 5 (జనంసాక్షి):
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కరువును ఎదుర్కొనే పరిస్థితి తలెత్తిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఆయన ఆదివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వనరులను సక్రమంగా వినియోగిస్తే ఎంతో అభివృద్ధి సాధించవచ్చన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 70వేల ఎకరాలకు పెన్‌గంగ ప్రాజెక్టు నీరందిస్తున్నారు. సమైక్య పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని.. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు 40 ఏళ్లు అవుతున్నా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వాగులన్నింటినీ అనుసంధానం చేస్తూ ప్రణాళికలు రూకల్పన చేస్తున్నట్లు చెప్పారు. గత పాలకులు ప్రాణహిత-చేవెళ్లపై ప్రణాళిక లేకుండా పనులు చేపట్టారని.. రూ.9వేల కోట్లు ఖర్చు పెడితే రూ.4వేల కోట్లు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. ప్రాణహిత నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని చేవెళ్లకు నీరు తీసుకెళ్లడం అసాధ్యమన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా 1.5 లక్షల ఎకరాలకు నీరందించే ప్రయత్నం చేస్తామన్నారు. రాబోయే 7, 8 ఏళ్లలో తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఆదిలాబాద్‌లో త్వరలో విమానాశ్రయం రాబోతోందని కేసీఆర్ తెలిపారు. హరితహారం తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు.అలాగే నాటిన చెట్లను కాపాడే బాధ్యత పంచాయితీరాజ్ వ్యవస్థదేనని, నిర్లక్ష్య వహిస్తే చర్యలు తప్పవన్నారు.అంతకు ముందు కరింనగర్ పర్యటనలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ నా కుడి భుజం …తెలంగాణ ఉద్యమంలో అంకిత భావంతో పనిచేశారు.. ఉద్యమ కష్టకాలంలో నిబద్దతతో వ్యహరించారు.. ఆయనకు మంత్రి పదవి రాలేదని నిరాశ వుండొచ్చు….ఆయనను పుష్కరాల్లో మంత్రి వర్గంలోకి తీసుకొంటా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆదివారం హరితహారంలో భాగంగా పెద్దపల్లి, ధర్మారం నియోజకవర్గంలో బహిరంగసభల్లో ప్రసంగించారు. తెలంగాణలో ఆశించిన అభివృద్ది కోసం మంత్రి మండలిలో మార్పులు చేపట్టాల్సి వుందని తప్పక ఆయన సేవలు ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ధర్మారం వ్యసాయ మార్కెట్ కమిటీలో జరిగిన సభలో తెలిపారు. గోదావరి పుష్కరాల్లో స్నానం చేసేందుకు ఈనెల 13న సాయంత్రం ధర్మపురికి వస్తానని అప్పటి వరకు ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో ఆయాప్రదేశాలు గుర్తించి వెంటనేవాటిని పెట్టాలని కోరారు. ధర్మపురి అభివృద్ది కోసం కొప్పుల ఈశ్వర్ చేసిన ప్రతిపాదనలకు పుష్కరస్నానం అనంతరం అక్కడే నాలుగు గంటలు వుండి అధికారులతో సమీక్ష చేసి ఆయన పథకాలను ప్రకటించి పోతాతని అన్నారు. అంతకు ముందు మధ్యాహ్నం పెద్దపల్లి ఐటిఐ ప్రాంగణంలో జరిగిన హరితహారంలో మొక్క నాటి బహిరంగసభలో ప్రసంగించారు. మొక్కల పెంపకంలో సమన్వయ రాహిత్యంగా అధికారులు వ్యవహరిస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో హరితహారం కార్యచరణ రూపొందించేందుకు గ్రామల వారిగా ఎక్కడ కూడా సమావేశాలు జరపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపటిసిలు, సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు జడ్పీటిసిలు చేయాల్సిన పని ఎమ్మెల్యేలు చేయాలా?అని ప్రశ్నించారు. కరీంనగర్ పంచాయతీ అధికారి పని సంతృప్తికరంగా లేదని ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విఆర్‌వో, గ్రామ కార్యదర్శి, గ్రామ విస్తరణ అధికారులు,డిఎల్‌పివోలు తూ.తూ మంత్రంగా పనిచేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వుంటుందని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పండ్ల మొక్కలు కోటి రూపాయల వ్యయంతో కొనుగోలు చేసి పంచుతున్నాడని ఇది ఎంతో గొప్ప విషయమని అన్నారు. నియోజకవర్గం మొత్తం ఇలా పండ్లమొక్కలు గత ఇరువై ఏళ్ళ క్రితం సిద్దిపేటలో తాను పంచానని గుర్తుచేశారు. వెల్గటూర్ రాయపట్నం మీదుగా ఆదిలాబాద్ జిల్లాలో సాయంత్రం 5.48 నిమిషాలకు గూడెం వద్ద ప్రవేశించారు. గోదావరి బ్రిడ్జిపై సుమారు 25 నిమిషాలు సమావేశమై కొత్తబ్రిడ్జి పనులు సమీక్షించారు.