మేమెంతో మాకంతే కావాలి
` బీసీ బంద్ విజయవంతం
` కదలని బస్సులు.. తెరవని దుకాణాలు
` ర్యాలీలు..రాస్తారోకోలతో ఆందోళన
` బస్ డిపోల ముందు నేతల బైఠాయింపు
` బస్సుల బందుతో ప్రయాణికుల ఇబ్బందులు
` నిరసనల్లో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు
` స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లే లక్ష్యంగా రోడెక్కిన బీసీ ఐకాస నేతలు
హైదరాబాద్(జనంసాక్షి): బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ ఐకాస చేపట్టిన బంద్ తెలంగాణవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. ఈ బంద్‌కు రాష్ట్రంలోని కాంగ్రెస్, భాజపా, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతోపాటు ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే బస్సుల బందుతో ప్రయాణి కులు ఇబ్బంది పడ్డారు. గ్రామాలకు వెళ్లాలనుకున్న వారు ఇబ్బందులు పడ్డారు. దీంతో బంద్ పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బంద్‌కు మద్దతుగా బీసీ సంఘాలు నిరనస చేపట్టాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకుంటున్నారు. బంద్‌లో పాల్గొని దుకాణాలు, వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. బంద్ కారణంగా హైదరాబాద్‌లో పలు చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమిత మయ్యాయి. ఉప్పల్, చెంగిచర్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. కూకట్‌పల్లి బస్ డిపోలో దాదాపు 125 ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బంద్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బీసీ బంద్ నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట, రోడ్లపై నేతలు బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు, కులసంఘాల నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. బీసీ సంఘాల నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లో బీసీ బంద్ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణెళిశ్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వద్ద జరిగిన ధర్నాలో భాజపా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ వద్ద తెలంగాణ బీసీ ఐకాస నేతలు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో భారత రాష్ట్ర సమితి నేత శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్, వికారాబాద్ ఆర్టీసీ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల బంద్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్‌లో పలు బస్టాండ్లు వెలవెలబోయాయి. బంద్‌లో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. బీసీ ఐకాస చేపట్టిన బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. పలు చోట్ల నాయకులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. మరోవైపు బంద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని డీజీపీ సూచించడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. హైదరాబాద్ అంబర్‌పేట్ ప్రాంతంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. బీసీ సంఘాల నాయకులు బంద్ చేపట్టారు. ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే బంద్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు. వి.హనుమంతరావుతో సహా కాంగ్రెస్ నేతలు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ.. ర్యాలీగా ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో ర్యాలీలో వి.హనుమంతరావు ప్లెక్సీ పట్టుకుని నడుస్తుండగా.. అది అడ్డువచ్చి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావును పైకి లేపారు. అనంతరం ర్యాలీ యథావిధిగా కొనసాగింది. వి.హనుమంతరావు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. కాగా, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు పాస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం: ఎంపి ఈటెల
తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా అలాగే సాధ్యం అవుతుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్యంగా ఉద్యమాలు చేద్దామని బీసీ వర్గానికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ లో బీసీల బంద్ లో ఈటెల పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ’తెలంగాణ బంద్ లో పాల్గొని మద్దతు తెలిపినట్లు వివరించారు. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని.. అన్నీ తెలిసినా బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు. పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయని అన్నారు. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్లపాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లో చేర్చారని గుర్తు చేశారు. తెలంగాణలోనూ కేసీఆర్ ఒకసారి సర్వే చేసి బీసీ కవిూషన్ వేశారని.. ఎన్ని వేసిన నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదని విమర్శించారు. ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదని దుయ్యబట్టారు ఈటల. లెక్కలు తీశారు.. కానీ అవన్నీ తప్పుల తడక అని విమర్శించారు. 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. తామెంత మంది ఉన్నామో.. తమకు అంత కావాలని అన్నారు. యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో బీసీలు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8మంది మంత్రులుండాలని కానీ, ముగ్గురే ఉన్నారని ధ్వజమెత్తారు. ఉన్నా వారికి ఇచ్చిన మంత్రి శాఖలు చిన్నవే అని పేర్కొన్నారు. బీసీల పట్ల ముసలికన్నీరు కాకపోతే నామినేటెడ్ పోస్టుల్లో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని ప్రకటించిన ప్రధాని మోదీ క్యాబినెట్ లో 27మంది క్షఃఅ మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ నిజాయితీని ఎవరు శంకించలేరని అన్నారు. మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి ప్రధాని అమలు చేశారని గుర్తు చేశారు. తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం చేశారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చెయ్యాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. ఈ బంద్ కి పిలుపు ఇచ్చింది బీసీ జేఏసీ అని.. అనివార్యంగా అన్ని పార్టీలు పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని చెప్పారు. బీసీ బంద్ విజయవంతం కావడం తొలిసారని చెప్పుకొచ్చారు. 42 శాతం రిజర్వేషన్ల స్థానిక సంస్థలలో మాత్రమే కాదు.. చట్టసభల్లోనూ వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం
` అందరి ఆమోదంతోనే ముందుకు సాగుతాం
` మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
` రాష్ట్రంలో మద్దతిచ్చి.. కేంద్రంలో భాజపా వెనకడుగు
` మంత్రి పొన్నం
ఖమ్మం(జనంసాక్షి):కులగణన ఆధారంగా బీసీల రిజర్వేషన్ల కోసం శాసనసభలో అన్ని పార్టీల ఆమోదం తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా న్యాయం కోసం ముందుకెళ్లామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. సత్తుపల్లిలో చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా రాజ్యాంగబద్ధంగా అందరికీ సమన్యాయం జరిగి, రాజ్యాధికారం కల్పించాలనేదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్దేశమని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని మంత్రి తుమ్మల గుర్తు చేశారు.అందరికీ విద్యా, ఉద్యోగం కల్పించాలనే గొప్ప సామాజిక విప్లవం కోసం రాహుల్ గాంధీ మేనిఫెస్టో రూపొందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. కొద్ది తేడాతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకామరమే.. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారాలతోనే చట్టం చేశామని పేర్కొన్నారు. చట్టబద్ధత ఇవ్వాల్సిన గవర్నర్లు, రాష్ట్రపతి పట్టించుకోవడం లేదని తుమ్మల ఆరోపించారు. న్యాయబద్ధంగా చట్టసభల్లో అమలు చేసిన కూడా సాంకేతిక కారణాలతో బీసీ రిజర్వేషన్ల అమలుకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్ రాష్ట్రంలో చట్ట సవరణ ద్వారానే ప్రధానమంత్రి మోదీ బీసీగా కన్వర్ట్ అయ్యారని మంత్రి తుమ్మల తెలిపారు. నరేంద్ర మోదీ కులం బీసీ కాకపోయినా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆయన సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చిందని పేర్కొన్నారు. బీసీగా ప్రధానమంత్రి స్థానం దక్కించుకున్న మోదీ, తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మద్దతిచ్చి.. కేంద్రంలో భాజపా వెనకడుగు: మంత్రి పొన్నం
తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు నిరసన చేపట్టారు. రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రంలో ఉన్న భాజపాను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. బీసీ బంద్‌లో తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఇందు కోసం కుల సర్వే నిర్వహించినట్లు తెలిపారు. భాజపా రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతిచ్చి.. కేంద్రంలో మాత్రం వెనకడుగు వేస్తోందని విమర్శించారు.
బీసీ బిల్లు కోసం త్వరలో మోడీని కలుస్తాం
` రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది
` టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్(జనంసాక్షి):బీసీ బంద్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంబర్‌పేట్ చౌరస్తా దగ్గర నిర్వహించిన ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంద్ విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు.‘‘బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. కుల సర్వే చేశాం. జీవో ఇచ్చాం. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తాం. ప్రభుత్వ పరంగా 42 శాతంతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. బీసీ బంద్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంబర్‌పేట్ చౌరస్తా దగ్గర నిర్వహించిన ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంద్ విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. కుల సర్వే చేశాం. జీవో ఇచ్చాం. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తాం. ప్రభుత్వ పరంగా 42 శాతంతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటాం అని పేర్కొన్నారు.
రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్‌కు మద్దతివ్వడమేంటీ?
` తెలంగాణ ఉద్యమతరహాలో బీసీ ఉద్యమం
` ఆటోలతో ర్యాలీ నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీల బంద్‌కు మద్దతుగా ఆటోలతో ర్యాలీగా బయల్దేరి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి మాట్లాడారు. గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని.. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారని.. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని.. బీసీ బంద్ ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నట్లు తెలిపారు. బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదని కవిత విమర్శించారు. ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదని చెప్పారు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని.. అందుకే కోర్టు జీవో ను కొట్టేసిందని అన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, తమిళనాడు లో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదని.. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోందని ్గªర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధిగా పనిచేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.మానవహారంలో పాల్గొన్న యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ.. ’78 ఏళ్లుగా బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు బీసీ లను మోసం చేస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది. రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించకుండా బీజేపీ కూడా నాటకాలు ఆడుతోంది. బీఆర్‌ఎస్ కూడా కులగణన చేయకుండా మోసం చేసింది. జూబ్లీహిల్స్ లో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ నాటకం చేస్తోంది. ఏ పార్టీ కూడా బీసీలకు మంచి చేయటం లేదు. బీసీలు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దొంగ మాటలు చెప్పే పార్టీలకు బీసీలంతా బుద్ది చెప్పే రోజు వస్తుంది. రిజర్వేషన్ల విషయంలో తూతూ మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేయవద్దు. బీసీలు విూ చెప్పు చేతల్లో లేరు. విూ పాపాల లెక్కను మేము రాసుకుంటాం. బీసీలను మోసం చేస్తున్న అన్ని పార్టీలకు రాబోయే రోజుల్లో బుద్ది చెబుతాం. బీసీల పట్ల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.