సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు

` విధి నిర్వహణలో అలసత్వం సరికాదు
` పథకాల పనుల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించం
` అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్‌(జనంసాక్షి):సొంత నిర్ణయాలను పక్కన పెట్టండి, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సాగండి..విధి నిర్వహణలో అలసత్వం తగదని గుర్తించండి అంటూ అధికారులకు సిఎం రేవంత్‌ హెచ్చరిక లాంటి సూచన చేశారు. పథకాలు, అభివృద్ధి పనుల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండేళుగడుస్తున్నా.. కొందరు అధికారుల పనితీరులో ఇంకా మార్పు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్‌ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శులతో సీఎం రేవంత్‌ శనివారం సమావేశమయ్యారు. కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా పాతపద్దతిలోనే పోతామంటే కుదరదని అన్నారు. అధికారులు అలసత్వం వీడి అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని హితవు పలికారు. సొంత నిర్ణయాలతో అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే పనులు వేగవంతమవుతాయని, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని దిశానిర్దేశర చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సవిూక్షించాలన్నారు. కీలక దస్త్రాలు, పనులు ఎక్కడా ఆగిపోవడానికి వీల్లేదు. కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలి. ఇకపై సీఎస్‌, సీఎంవో అధికారులు ప్రతివారం నివేదికలు అందించాలని సీఎం ఆదేశించారు.