ఆక్రమణల తొలగింపుతో మారనున్న పట్టణ స్వరూపం

సుందరీకరణకు సహకరించాలంటున్న అధికారులు
జగిత్యాల,మే8(జ‌నం సాక్షి): జగిత్యాల పట్టణంలో రహదారుల విస్తరణ పనులను మున్సిపల్‌  అధికారులు చేపట్టడంతో ట్రాఫిక్‌ చిక్కులు తొలగనున్నాయి. విస్తరణతో కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రానికి సొబగులు అందనున్నాయి. దీనికితోడు గ్రీనరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. పట్టణంలో చేపట్టిన ఈ పనులు పూర్తయితే జగిత్యాల సుందర నగరంగా కనిపిస్తుందని అధికారులు అన్నారు. ఇందుకు ప్రజలు సహకరిస్తే మన పట్టణం మంచిగా ఉంటుందన్నారు. గతంలోనే  పాత బస్టాండు
నుంచి గంజ్‌ మార్గంలో పలు ఆక్రమణలను అధికారులు  కూల్చివేశారు.  మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను తొలగించాలని బల్దియా అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. యధావిధిగానే రోడ్డు విస్తరణపై పట్టణవాసులు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. ఆక్రమిత నిర్మాణాల గుర్తింపులోనూ బల్దియా అధికారులు పక్షపాతం చూపుతున్నారని పలువురు మండిపడ్డారు. రోడ్డుకు ఒకవైపునకే నిర్మాణాలు తొలగించారని అధికారులు చెబుతున్నారని ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని పలువురు మహిళలు అధికారులను కోరారు. నిబంధనల మేరకు పట్టణమంతా రహదారుల విస్తరణ జరుగుతుందని అధికారులు స్థానికులకు వివరించారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఎవరికివారు నిర్మాణాలు తొలగించుకోవాలని లేదంటే తాము జేసీబీతో కూల్చితే నష్టం అధికంగా జరుగుతుందని అవగాహన కల్పించారు.  న్యాయపరమైన సమస్యలు ఉన్నప్పటికీ నిబంధనల మేరకు వ్యవహరించాలని  పుర అధికారులకు సూచించారు. మొత్తంగా అధికారులు కఠినంగా వ్యవహరించడంతో ప్రజలు కూడా సహకరించడానికి ముందుకు వచ్చారు. దీంతో పట్టణ విస్తరణకు
మార్గం సుగమం అయ్యింది.