ఆగస్టులో పాక్‌కు భారత్‌ క్రికెట్‌ జట్టు విండీస్‌ టూర్‌ త్వరగా ముగించేందుకు పీసీబీ యత్నాలు

లా¬ర్‌, డిసెంబర్‌ 27: ద్వైపాక్షిక సంబంధాలు మళ్ళీ మెరుగుపడడంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు భారత జట్టును తమ దేశం రప్పించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే ఏడాది ఆగష్టులో పాక్‌ పర్యటనకు రావాల్సిందిగా బీసిసిఐని కోరనున్నట్టు పిసిబీ తెలిపింది. దీని కోసం జూలైలో వెస్టిండీస్‌ టూర్‌ను త్వరగా ముగించేందుకు ప్రణాళికలు కూడా సిధ్ధం చేసుకుంది. తాజాగా పిసిబీ ఖరారు చేసుకున్న షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌ జట్టు జూలైలో కరేబియన్‌ దీవులకు వెళ్ళనుంది. అక్కడ విండీస్‌తో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ ట్వంటీ ఆడనుంది. నిజానికి ఈ టూర్‌ వాయిదా వేయాలని విండీస్‌ క్రికెట్‌ బోర్డు కోరినప్పటకీ… ఎక్కువ రోజులు మాత్రం కుదరదని పిసిబీ చెప్పింది. ప్రస్తుతం తమ దృష్టంతా భారత్‌తో సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వడంపైనే ఉన్నట్టు పిసిబీ అధికారులు చెబుతున్నారు. భారత్‌తో సంబంధాలు పూర్తిగా మెరుగుపడడంతో బీసిసిఐకి త్వరలోనే లేఖ రాయాలని పిసిబీ భావిస్తోంది. పాక్‌లో భారత క్రికెట్‌ జట్టుకు పటిష్టమైన భద్రత కల్పించే విషయంలో ఎంతమాత్రం రాజీ పడమని గతంలోనే పిసిబీ ఛైర్మన్‌ జాకా అష్రాఫ్‌ చెప్పారు. ఆగష్టులో పాకిస్థాన్‌ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకూ బీసిసిఐ నుండి ఎలాంటి స్పందనా లేదు. అయితే వచ్చే వారం అష్రాఫ్‌ భారత్‌కు వచ్చి దీనిపై బోర్డు వర్గాలతో చర్చించిన తర్వాత ఒక స్పష్టత వస్తుందని సమాచారం.