ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలకు భ్రమలు
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న కటకం
కరీంనగర్,మే26(జనం సాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణ సాధ్యంకాని హావిూలతో ప్రజలను మభ్య పెట్టారని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. వీరి నాలుగేళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు జరగలేదని ఆయన విమర్శించారు. తాజా సర్వేతో మోడీతో పాటు కేసిఆర్ కూడా ఇంటికి పోక తప్పదన్నారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శనివారంనాడిక్కడ ఆయన మాట్లాడుతూ ఇంకా ప్రజలను మభ్య పెట్టి మళ్లీ ఓట్లు దండుకోవాలన్న వీరి ప్రయత్నాలు ఫలించవన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో,రాష్ట్రంలో విజయం సాధిస్తుందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కారని విమర్శించారు. భూనిర్వాసితులు, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై వీరికి చిత్తశుద్ది లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి చరమగీతం పాడతామని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చి జాతీయ ¬దా రాకుండా కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆదాయంలో రాష్ట్రం నంబర్ వన్ అంటున్న కేసీఆర్.. మరి అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అమర వీరుల పునాదులపై టీఆర్‌ఎస్ అధికారం చెలాయిస్తోందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతుంటే నిరుద్యోగులను కొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర కోరుతుంటే రైతులకు బేడీలు వేస్తున్నారని చెప్పారు. ఇంతటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూడలేదన్నారు.
———