ఆటోస్టార్టర్లను తొలగించి విద్యుత్‌ ఆదా చేద్దాం

జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం: ఎమ్మెల్యే

జనగామ,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రైతులకు 24 గంటలపాటు వ్యవసాయానికి త్రీఫేజు విద్యుత్‌ను అందిస్తున్నామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పారు. ఆటోమేటిక్‌ స్టార్టర్లను తొలగించడం వల్ల భూగర్భ జలాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులందరిపైనా ఉందన్నారు.

ఆటోమేటిక్‌ స్టార్టర్లను స్వచ్ఛందంగా తొలగించి రాష్టాన్రికే మన జిల్లా ఆదర్శమని నిరూపించాలన్నారు. గత ప్రభుత్వాలు ఐటీ కంపెనీలకు నాణ్యమైన కరెంట్‌ ఇచ్చి రైతులకు మాత్రం లోవోల్టేజీతో కూడిన కరెంట్‌ను ఇచ్చేవారన్నారు. సీఎం కేసీఆర్‌ నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం 24 గంటలు కరెంట్‌ సరఫరా అవుతున్నందున అవసరం ఉన్నా, లేకున్నా ఆటోమేటిక్‌ స్టార్టర్లను వినియోగించడం వల్ల

భూగర్భజలాలు తగ్గుతాయన్నారు. ఎండాకాలంలో వరి పంటలు పొట్టకు వచ్చే సమయంలో నీటి కొరత వచ్చి పంటలు ఎండి పోయే ప్రమాదం ఉందన్నారు. వరి పంటకు మడిలో ఎంత నీరు అవసరం ఉందో అంతే నీరు నిల్వ ఉంచి నీటిని పొదుపు చేస్తూ పంట దిగుబడులు పెంచుకోవాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే నూతన మెలకువలు రైతులు తెలుసుకోవాలన్నారు. ఆటోమేటిక్‌ స్టార్టర్ల తొలగింపు వల్ల విద్యుత్‌ ట్రిప్‌ అవుతుందన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేయగా, అలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. రెప్పపాటు కరెంట్‌ కూడా పోదన్నారు.