ఆటో నడిపిన బాలుడు: నలుగురికి గాయాలు
పెద్దపల్లి,జూన్11(జనం సాక్షి): బాలుడిచేత డ్రైవర్ ఆటో నడిపించడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పంచాంగాలు చెప్పుకుంటూ ఆటో నడుపుకునే సిరిసిల్లా జిల్లాకు చెందిన ప్రసాద్… పెద్దపల్లి జిల్లా, సుల్తానా మండలంలో అభిషేక్ అనే బాలుడిని ఆటో ఎక్కించుకున్నాడు. అనంతరం ఆ బాలుడిని ఆటో నడపమని చెప్పాడు. నడపడం రాదని చెప్పినా వినకుండా బలవంతంగా ఆటో హ్యాండిల్ బాలుడి చేతిలో పెట్టాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రసాద్ మాత్రం ఆటో నుంచి దూకి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలుఅయ్యాయి. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.