ఆయల్‌పామ్ సాగుతో లాభాలు
వాతావరణం,నేలలు కూడా అనుకూలం
మంత్రుల ప్రోత్సాహంతో రైతుల్లో ఆసక్తి
సబ్సిడీతో పాటు, కొనుగోళ్లకు భరోసా
నిజామాబాద్,ఫిబ్రవరి11(జనంసాక్షి): రాష్ట్రంలో ఆయిల్ పాం సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. నిజామబాద్ లాంటి జిల్లా ప్రయోగాలకు ప్రసిద్దం. ఇప్పటికైతే ఇక్కడ అడుగు పడలేదు. అయితే ఏదైనా పంటప్రయోగం జరగగాలంటే ఇక్కడి రైతులు ముందుకు వస్తారు. వ్యవసాయశాఖ ఈ మేరకు ఆయా జిల్లాల్లో అనుకూలంగా ఉన్న పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ప్రోత్సాహం అందించడంతో పాటు సబ్సిడీ కూడా అందుతున్న కారణంగా ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. మొక్కదశ నుంచి మార్కెటింగ్ వరకు అన్ని రకాలుగా సాయం చేయనుంది. రైతులకు మొక్కను రూ.25లకే అందిస్తారు. మొక్కలను కూడా ఉపాధిహావిూ పథకం కింద అధికారులు నాటించనున్నారు. మొక్కలను పెంచడానికి ఈ ప్రాంతంలోనే అధికారులు నర్సరీని కూడా ఏర్పాటు చేయనున్నారు. సబ్సిడీపై వారికి డ్రిప్ పరికరాలు ఇవ్వనున్నారు. మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు జైపూర్ వద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కోసం తిప్పలు కూడా తప్పనున్నాయి. ఇక సాగు విషయానికి వస్తే ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని, నామమాత్రపు ఎరువులు వాడితే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు వర్షాలు కురిసి నీరు సమృద్ధిగా ఉంటే వరి పండిస్తున్నారు. ఆయిల్ పాం ప్రత్నామ్నాయ పంట కానుంది. రాబోయే రెండేండ్లలో తెలంగాణ వ్యాప్తంగా 42,250 ఎకరాల్లో సాగుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 2,500 ఎకరాల్లో తెలంగాణ ఉద్యానవన శాఖ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మొత్తం 246 మండలాలు అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ సాగు వల్ల రైతులను పంట మార్పిడి వైపు ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దీనివైపు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు ముందు కొచ్చారు. దీనికి సంబంధించి హార్టికల్చర్ శాఖ ఒక నివేదిక రూపొందించింది. వాతారణంతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీటి లభ్యత కూడా ఎక్కువగా ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం,వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పంట సాగు చేసేందుకు అనుకూలంగా ఉంది. నూనె గింజల ఉత్పత్తికి ఉష్ణోగ్రతలు, సాగుకు అనుగుణంగా దిగుబడి ఇచ్చే నేలలు ఉన్నాయని అధికారులు వెల్లడిరచారు. ఫలితంగా జిల్లా రైతాంగం ఆయిల్ పాం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఎకరా వరి సాగయ్యే నీటితో మూడెకరాల పామాయిల్ పంట సాగవుతుందని, అంతర పంటలతో అధిక లాభాలు వస్తాయని చెబుతున్నారు. ఆయిల్ పాం సాగుపై మొదటి నుంచీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తున్నారు.
““““““