ఆర్టీసిలో ఎన్నికల ప్రచారం ముమ్మరం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : ఈ నెల 22న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌ఎంయు, ఎఫ్‌డబ్ల్యుఎఫ్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ పోటీ చేస్తున్నాయని. గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఎన్‌ఎంయు నుంచి విడిపోయి తెలంగాణ వాదులు టిఎంయును స్థాపించారు. ఈ సారి ఎన్నికల్లో గట్టిపోటీ ఎదురుకావడంతో మరోసారి గుర్తింపు కార్మిక సంఘంగా విజయం సాధించేందుకు ఎన్‌ఎంయు విస్తృతంగా కృషి చేస్తుంది. తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడం, ఇటీవల సింగరేణి ఎన్నికల్లో కార్మిక సంఘంగా తెలంగాణ బొగ్గుగణి కార్మిక సంఘం విజయం సాధించిన నేపథ్యంలో, ఆర్టీసీ సంస్థల్లో కూడా విజయం సాధించేందుకు తెలంగాణ వాదులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.